మెడికల్‌ కళాశాల నిర్మాణంపై నీలినీడలు

ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గత మూడు నెలలుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ పనులను దక్కించుకున్న మెగా కంపెనీ కూడా యంత్ర సామగ్రిని తరలించే పనిలో ఉంది. మెడికల్‌ కళాశాల నిర్మాణం నిలిచిపోతుందేమోనని పశ్చిమ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం ప్రాంతం వైద్య రంగంలో పూర్తిగా వెనుకబాటులో ఉంది. మెరుగైన వైద్యం కోసం వందల కిలో మీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఆపద సమయాల్లో అత్యవసర సేవలు అందుబాటులో లేక దూర ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఒంగోలు, గుంటూరు, విజయవాడ, కర్నూలు నగరాలకు చేరేందుకు గంటల పాటు సమయం పట్టేది. ఈ లోగా ఎందరో రోగులు మార్గమధ్యంలో మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత వైసిపి ప్రభుత్వం మార్కాపురం ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అవసర మని గుర్తించింది. అందుకోసం మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద 53 ఎకరాల స్థలాన్ని సేకరించింది. ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణం కోసం రూ.473 కోట్లు కేటాయిం చింది. ఈ పనులను మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ దక్కిం చుకుంది. నిర్మాణ పనుల ను అప్పటి ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కరోనా సమయంలో పర్చువల్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. మార్కాపురం ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అత్యవసరమని తలచిన ప్రభుత్వం 2024 సెప్టెంబరు నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. మెగా కంపెనీ కూడా నిర్మాణ పనులను వేగవంతం చేసింది. 30 శాతానికి పైగా పనులు పూర్తి చేసింది. పూర్తి స్థాయిలో పనులు పూర్తవ్వాలంటే మరో రెండేళ్ల పాటు సమయం పట్టనుంది. ముందుగా నిర్ణయించిన 2024 సెప్టెంబరులో మెడికల్‌ కళాశాలను నిర్వహణలోకి తీసుకురావాలనే సంకల్పంతో మార్కాపురంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలను సర్వజన వైద్యశాలగా మార్పు చేశారు. ఆ వైద్యశాలలో కొన్ని భవనాలు నిర్మించారు. మెడికల్‌ కళాశాలకు సంబంధించిన వసతు లన్నీ కల్పించారు. కొంద రు వైద్యులను, వైద్య సిబ్బందిని నియమిం చారు. ఇక్కడ పరిస్థితు ల దృష్ట్యా మెడికల్‌ కళాశాలను నిర్వహించా లని కోరు తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరిన సంగతి తెలిసిందే. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి ఓటమిపాలైంది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వ కాలంలో ప్రారంభించిన మెడికల్‌ కళాశాలల నిర్మాణం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అందులో మార్కాపురం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల కూడా ఉంది. మొత్తానికి మూడు నెలలుగా నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. ఈ పాటికే మెడికల్‌ కళాశాలకు సంబంధించిన అనేక భవనాలు పూర్తి చేసుకున్నాయి. చుట్టూ ప్రహారీ గోడ కూడా నిర్మించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత మెడికల్‌ కళాశాల నిర్మాణం నిలిచిపోయిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికార పార్టీ నేతలు ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ప్రజల్లో అపనమ్మకం ఏర్పడింది. ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిసింది. బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. టిడిపి కూటమి ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్‌ను మార్పు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో అక్కడ మెగా కంపెనీ సామగ్రి ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. మార్కాపురం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణ విషయమై ఓ అధికారిని వివరణ కోరగా.. తాత్కాలికంగా పనులు నిలిపివేసినట్లు చెప్పారు. కాంట్రాక్టర్‌ మార్పు జరుగుతుందని సమాచారం అందిందన్నారు. నిర్మాణ పనులు ఇప్పట్లో ప్రారంభం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. తాత్కాలికంగా పనులు నిలిపివేయడంతో నిర్మాణంలోని కొన్ని విభాగాల్లో నష్టం కూడా జరిగే అవకాశం ఉందన్నారు. ఒకవేళ కాంట్రాక్టర్‌ను మార్చినా.. త్వరలో పనులు ప్రారంభిస్తే నిర్మాణం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి…!

➡️