పి4 పేరుతో బూటకపు కబుర్లు

Apr 15,2025 00:42

మాట్లాడుతున్న సిహెచ్‌ బాబూరావు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
పి4 ద్వారా పేదరిక నిర్మూలన చేస్తామంటూ కూటమి ప్రభుత్వం బూటకపు కబుర్లు చెబుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు విమర్శించారు. నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ అధ్యక్షత వహించగా బాబూరావు మాట్లాడుతూ దానధర్మాలు చేయటాన్ని తాము తప్పుపట్టబోమని, అయితే పేదలపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పేదరిక నిర్మూలనను బాధ్యతగా చేపట్టాలని, దయాదాక్షిణ్యాల మీద కాదని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజల హక్కుని, ప్రజల సంపద ప్రజలకే దక్కాలని అన్నారు. సూపర్‌6 హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు సౌకర్యం కల్పించాలన్నారు. కనీస వేతన సవరణ 20 ఏళ్ల క్రితం నుండి సవరించలేదని, పెరిగిన జీవన ప్రమాణాలు నిత్యావసర సరుకులు అనుగుణంగా వేతనాలు దక్కక కార్మికులు అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌, అవుట్సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయడంతోపాటు వారిపై రాజకీయ వేధింపులు నివారించాలన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలకు ఆదాయాలు చూపించి పేదరిక నిర్మూలన చేయాలన్నారు. పంటలకు మద్దతు ధరలు కల్పించాలన్నారు. ఉద్యోగులకు పిఆర్‌సి ఇవ్వాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఇవన్నీ వదిలేసి పి4 అంటూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. కార్పొరేట్లకు భూములను దారాదత్తం చేయకుండా భూమిలేని దళితులకు, పేదలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ మాట్లాడుతూ అక్షరాస్యత పరంగా వెనుక బడిన పల్నాడు జిల్లాలో నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు, 100 గ్రామాలకు తాగునీరు అందుతుందని, ప్రభుత్వం సత్వరం ఈ ప్రాజెక్టు పనులను చేపట్టాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, జి.రవిబాబు, ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, ఏపూరి గోపాలరావు, నాయకులు పాల్గొన్నారు.

➡️