ఏరియా వైద్యశాలలో బోరు నిర్మాణం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రోగుల సౌకర్యార్థం లివింగ్‌ వాటర్‌ సంస్థ ఆధ్వర్యంలో గురువారం మంచినీటి బోరు నిర్మాణం చేపట్టారు. 360 అడుగుల లోతు దాకా బోరు వేయించారు. మంచినీరు పుష్కలంగా పడ్డాయి. ఈ సందర్భంగా లివింగ్‌ వాటర్‌ సంస్థ డైరెక్టర్‌ సామ్యేలు డేవిడ్‌ మాట్లాడుతూ ఏరియా వైద్యశాలకు ప్రతిరోజూ 700 మంది రోగులు వస్తుంటారని, వంద మంది దాకా ఇన్‌ పేషెంట్లుగా చేరుతున్నారని, వారి అవసరాల రీత్యా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేవర యదిద్యా తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. దీంతో తాము బోరు వేయించామని, మోటారును కూడా అమర్చుతామని చెప్పారు. దానికి అనుసంధానంగా శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రతిరోజూ పది వేల లీటర్ల శుద్ధజలం వచ్చేలా పరికరాలను సిద్ధం చేస్తామని చెప్పారు. బోరు వేయించిన లివింగ్‌ వాటర్‌ సంస్థ డైరెక్టర్‌ సామ్యేలు డేవిడ్‌కు ఆసుపత్రి సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేవర యదిద్యా, భూపతిపల్లి సర్పంచ్‌ మున్నంగి లాజర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️