ఇరువురిలోనూ కలవరం

May 14,2024 21:48

ప్రజాశక్తి- చీపురుపల్లి : చీపురుపల్లి నియోజకవర్గంలో ఓటర్‌ నాడి అంతు చిక్కడం లేదు. గతంలో కన్నా పోలింగ్‌ అధికంగా నమోదు కావడం, మహిళా ఓట్లు, యువ ఓటర్ల పోలింగ్‌ శాతం గణనీయంగా పెరగడం వంటి పరిణామాలతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతం కంటే పోలింగ్‌ శాతం పెరగడంతో ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయన్న అంశంపై నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. పోలింగ్‌లో సాగిన తీరును ప్రధాన పార్టీ అభ్యర్ధులు తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ విజయంపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్త్తున్నారు. 2004, 2009, 2019లలో మూడు సార్లు చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తాజా మంత్రి బొత్స సత్యనారాయణ నాలుగోసారి కూడా తన గెలుపు ఖాయమని మొదటి నుంచి నమ్మకంతో ఉన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో కూటమిదే విజయమని కూటమి అభ్యర్థి కిమిడి కళావెంకటరావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలతో పాటు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్దే తనను గెలుపిస్తుందని బొత్స సత్యనారాయణ ధీమాగా ఉన్నారు. కేంద్రంలో మోడీ చేపడుతున్న సంక్షేమ పథకాలు, టిడిపి, బిజెపి, జనసేన ప్రవేశ పెట్టిన ఉమ్మడి మేనిఫెస్టులోని సూపర్‌సిక్స్‌ పథకాలు, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ప్రచారం సాగుతున్న కొద్దీ ప్రభుత్వ అనుకూల ఓట్లలో చీలిక వచ్చిందని, ముఖ్యంగా యువత, ఉద్యోగ, ఉపాధ్యాయ, వర్గాలు తమకు అనుకూలంగా ఓటు వేసారనే నమ్మకం వంటివి తమకు లాభం చేకూరుస్తాయని టిడిపి అభ్యర్ధి కళావెంకటరావు నమ్మకంతో ఉన్నారు. పెరిగిన పోలింగ్‌ శాతంనియోజకవర్గంలో 2019లో 80 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి అది పెరిగి 83.48 శాతం కావడంతో కూటమి పార్టీ కాస్త ధీమాగా ఉండడమే కాకుండా పెరిగిన పర్సంటేజి తమకు కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గంలో 2,05,484 మంది ఓటర్లుండగా 1,71,533 మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు. గత ఎన్నికల కంటే ప్రస్తుత ఎన్నికలలో 3.48 శాతం మంది ఓటర్లు అదనంగా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో గతంకంటే భిన్న పరిస్థితులు ఏర్పడడం వల్ల టిడిపికి అనుకూలంగా ఉంటుదని ఆ పార్టీ అభ్యర్ధి కిమిడి కళావెంకటరావు, తాను చేసిన అబివృధ్దే తనను గెలిపిస్తుందని బొత్స సత్యన్నారాయణలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరు చీపురుపల్లి ఎమ్మెల్యే పీఠాన్ని అదిరోహిస్తారో జూన్‌ 4 వరకు వేచి చూడాల్సిందే.పార్టీ కార్యాలయాల్లో బిజీ బిజీగుర్ల: టిడిపి, వైసిపి కార్యకర్తలు, నాయకులు మంగళవారం పార్టీ కార్యాలయాలలో బిజీ బిజీగా కనిపించారు. సోమవారం పోలింగ్‌ ముగియడంతో మొత్తం పోలైన ఓట్లులో తమ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అని లెక్కలు వేసుకొని తమ అంచనాలపై చర్చించుకుంటున్నారు. 2019 సాధారణ ఎన్నికలలో గుర్ల మండలం నుంచి వైసిపికి 6,500 పైగా మెజారిటీ వచ్చింది. 2019 సాధారణ ఎన్నికలు మినహా గతంలో జరిగిన ఎన్నికలలో టిడిపికి ఎప్పుడూ మెజారిటీ వచ్చేది. ప్రస్తుతం జరిగిన ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత వల్ల టిడిపికి 2వేల ఓట్లు మెజారిటీ వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వల్ల తమ పార్టీకి గతంలో వచ్చిన మెజారిటికి వెయ్యి ఓట్లు అటుఇటుగా మెజారిటి వస్తుందని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. ఈ లెక్కలతో పాటు గ్రామాలలో మధ్యస్తంగా ఉన్న ఓట్లు ఏ పార్టీకి ఎక్కువగా వస్తే వారిదే మెజారిటి అని రాజకీయా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరువర్గాలు ఓట్లు కోసం డబ్బులు, మద్యంను అందించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీలు నాయకులూ కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పనిచేశారు. ప్రధానంగా వలస ఓటర్లును రపించడంలో గ్రామస్థాయి నాయకులు ఎక్కువ శ్రద్ద కనబరిచారు. మంగళవారం ఉదయం నుంచి నియోజకవర్గ కేంద్రంలో కార్యకర్తలు తమ అభ్యర్థులకు ఓట్లు పోలింగ్‌ శాతంపై తమ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయన్న లెక్కలను వివరించారు.

➡️