లంచాలు అడిగినా, పర్పంటేజీలు కోరినా లోపలేయిస్తా

Feb 4,2025 23:32

మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు
ప్రజాశక్తి – వినుకొండ :
పరిశ్రమల, భూముల యజమానుల్ని బెదిరించే రోజులు కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లిపోయాయని, వినుకొండలో రియలెస్టేట్‌ రంగానికి పూర్తి సహకారం ఉంటుందని ప్రభుత్వ చీఫ్‌విప్‌, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టణానికి చెందిన రియలెస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లతో స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. డిటిసిపి, మున్సిపల్‌ అనుమతి పొందిన లే అవుట్లనే రియలెస్టేట్‌ వ్యాపారులు అమ్మాలని, సమస్యలేమైనా ఉంటే తాను పరిష్కరిస్తానని చెప్పారు. వెంచర్లకు అవసరమైన లింక్‌రోడ్లు ఏమైనా ఇబ్బంది ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు. లేఅవుట్ల అనుమతులకు అధికారులు ఎవరైనా లంచాలు అడిగితే తాటతీస్తామన్నారు. వివాదాలు లేని భూములు మాత్రమే కొని లేఅవుట్లు వేయాలని, నాణ్యమైన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. 10-20 ఏళ్ల నుంచి వినుకొండ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. రిజిస్ట్రేషన్‌ విలువ ఎక్కువ ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని చెబుఆమని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర రహదారి కావాలని కోరారని, రోడ్డు వేయడానికి అక్కడ ప్రభుత్వ భూమి ఉందా, కళాశాలకు ఇబ్బంది లేకుండా ఎలా చేయొచ్చో పరిశీలిస్తామని చెప్పారు. ల్యాండ్‌ కన్వర్షన్‌ త్వరితగతిన చేసేవిధంగా తహశీల్దార్‌, రెవెన్యూ అధికారులతో మాట్లాడామన్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా అధికారులు లంచాలు అడిగితే తన దృష్టికి తేవాలని, ఎవరైనా తన పేరు చెప్పి లంచాలు, పర్సంటేజీలు, వాటాలు అడిగినా తన దృష్టికి తీసుకొస్తే కేసులు పెట్టి లోపల వేయిస్తానని తెలిపారు. వివాదాల్లో ఉన్న భూములను కొనుగోలు చేసి అనవసరంగా సమస్యల్లో ఇరుక్కోవద్దని సూచించారు.

➡️