మంచే గుర్తింపు తెస్తుంది

May 25,2024 20:27

ప్రజాశక్తి-విజయనగరం కోట : మనం చేసే వృత్తిలో చేపట్టిన మంచిపనులే ఎవరికైనా గుర్తింపు తెస్తాయని సెట్విజ్‌ మేనేజర్‌ గొర్రెపాటి శ్రీనివాసరావు అన్నారు. ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనున్న ఆయన ప్రజాశక్తితో మాట్లాడారు. తన ఉద్యోగ జీవితం గురించి వివరించారు. విశేషాలు ఆయన మాటల్లోనే..మా స్వగ్రామం జామి మండలం విసినిగిరి. తల్లిదండ్రులు గొర్రెపాటి సూర్యారావు, సీతమ్మకు 1962 జూన్‌ 1న జన్మించాను. నా ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనే సాగింది. కొట్టాం హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్‌, డిగ్రీ విశాఖలోని ఎవిఎన్‌ కళాశాలలో పూర్తి చేశాను. తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ఉండగా అకాల మరణం చెందడంతో ఆయన ఉద్యోగ స్థానంలో 1988 ఆగస్టు 8న కొట్టాం హైస్కూల్లో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరాను. 1991లోలక్ష్మీదేవితో వివాహమైంది. ఆమె గరివిడి మండలం కొండపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయరాలిగా పనిచేస్తున్నారు. మాకు కుమార్తె మదుల కిరణ్‌, అల్లుడు దిలీప్‌కుమార్‌, మనుమరాలు తస్విక, మను మడు తన్విక్‌ ఉన్నారు. దిలీప్‌కుమార్‌ దుబా యిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. నా తండ్రి ఎంతో గౌరవ మర్యాదలతో పాటుగా వృత్తిలో మంచి పేరు సంపాదించుకున్న కొట్టాం హైస్కూలులోనే నేను ఉద్యోగంలో చేరడం చాలా ఆనందాన్నిచ్చింది. అక్కడ కొంత కాలం పనిచేసి బొండపల్లి మండలంలో ఎంపిడిఒ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతిపై వెళ్లాను. తరువాత డెంకాడ బదిలీ అయ్యింది. అనంతరం జామి మండలం ఎంపిడిఒగా ఎఫ్‌ఎసిపై బాధ్యతలు చేపట్టాను. తరువాత జియ్మమ్మవలస, సీతానగరం మండలాల్లో ఎంపిడిఒగా విధులు నిర్వహించాను. ఆయా మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతల్లో కీలకపాత్ర పోషించాను. తరువాత ఉద్యోగోన్నతిపై 2023జూన్‌లో విజయనగరం యువజన సర్వీసుల శాఖ సెట్విజ్‌ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టాను. ఎక్కడికి వెళ్లినాఉద్యోగులందరితో సోదరభావంతో మెలిగి గుర్తింపు తెచ్చుకున్నాను. ఎంపిడిఒగా తన సొంత డబ్బులతో పేదలకు అనేక సేవలందించాను. ఉద్యోగ జీవితంలో ఉద్యోగులు, కుటుంబ సభ్యులు అందించిన సహకారం మరువలేనిది. ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతాను.

➡️