ప్రజాశక్తి – విజయపురిసౌత్ : ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రమైన నాగార్జున కొండను అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు శనివారం సందర్శించారు. అక్కడి కట్టడాలు, శిల్పాలను వారు సందర్శించి కొనియాడారని పురావస్తు పరిశోధకులు, ప్లీజ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధ వనంలో జరిగిన అంతర్జాతీయ త్రిపిటక పఠనోత్సవానికి వచ్చిన మన దేశానికి చెందిన 27 మంది, శ్రీలంక, మయన్మార్ కంబోడియా, లావోస్, థాయిలాండ్, వియత్నాం లాంటి దక్షిణ ఆసియా దేశాల నుంచి వచ్చిన 88 మంది బౌద్ధ బిక్షువులకు నాగార్జున కొండలోని బౌద్ధ ప్రదర్శనశాల, పునర్ నిర్మించిన బౌద్ధ కట్టడాలను శివనాగిరెడ్డి చూపించి వివరించారు. బౌద్ధ ప్రదర్శనశాలలోని శిల్పాల గురించి మ్యూజియం అధికారి కమలహాసన్ వివరించగా బౌద్ధ బిక్షువులు ఆసక్తిగా ఆలకించి ఆచార్య నాగార్జునడు నడయాడిన నేలపై తామూ అడుగు పెట్టడం తమకెంతో ఆనందాన్నిచ్చిందని సంతోషం వెలిబుచ్చారు. ఆచార్య నాగార్జునుని రచనలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో బుద్ధవనం అధికారులు డిఆర్ శ్యాంసుందర్రావు, డాక్టర్ రవిచంద్ర పాల్గొన్నారు.
