బడి మూసివేతకు పన్నాగం.. వద్దని విన్నపం..

Feb 4,2025 01:01

అధికారులకు విన్నవించేందుకు వచ్చిన యనమదల రాజీవ్‌నగర్‌ కాలనీవాసులు
ప్రజాశక్తి – ప్రత్తిపాడు :
వీలీనం పేరుతో తమ ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులను మరో పాఠశాలకు పంపొద్దని తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు ఎంపిడిఒ, ఎంఇఒను సోమవారం కలిసి విన్నవించారు. మండలంలోని యనమదల రాజీవ్‌నగర్‌ కాలనీలోని ప్రాథమిక పాఠశాల 3, 4, 5 తరగతుల విద్యార్థులను వచ్చే ఏడాది నుండి కిలోమీటరు దూరంలోని పాఠశాలలో విలీనం చేస్తున్నారని గ్రామస్తులకు తెలిసింది. దీంతో వారు అధికారులను సంప్రదించారు. తమ కాలనీ ఏర్పడిన నాటి నుండి పాఠశాల తమకు అందుబాటులో ఉందని, కూలినాలి చేసుకునే తాము పొద్దున్నే పిల్లల్ని రెడీ చేసి పనులకు వెళ్తే బడికి వారే వెళ్లేవారని చెప్పారు. ఇప్పుడు వీలనమంటూ చెబుతున్న పాఠశాలకు పంపించాల్సి వస్తే అది తమ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో ఉంటుందని, ఆ మార్గంలో నిత్యం భారీ వాహనాలు తిరుగుతూ ఉంటాయని, చెరువులు కూడా ఉన్నాయని, పిల్లలకు ప్రమాదాలు పొంచి ఉంటాయని ఆందోళన వెలిబుచ్చారు. తమ ప్రాంతంలోని పాఠశాలను వీలీనం చేయకుండా విద్యార్థులను అక్కడే కొనసాగించాలని తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ టి.మరియదాసు కోరారు. ఈ మేరకు ఎంపిడిఒ శివపార్వతి, ఎంఇఒ-1 రమాదేవికి వినతిపత్రాలు ఇచ్చారు. ఉన్నతాధికారులకు విషయం తెలియజేస్తామని అధికారులు బదులిచ్చారు. ఇదిలా ఉండగా పాఠశాలలలో సగం మంది పిల్లలను విలీనం పేరుతో మరో పాఠశాలకు పంపిస్తే ఇప్పటికే ఉన్న పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సరిపడా విద్యార్థులు లేరని టీచర్ల సంఖ్యను కుదించే అవకాశం ఉంది. దీంతోపాటు ఏకంగా పాఠశాలనే మూసివేసే ప్రమాదం ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కొంమంది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు కాకుండా ప్రైవేటు పాఠశాలలకు పంపించే అవకాశమూ ఉందని, తద్వారా పేదలకు ఉచిత ప్రభుత్వ విద్యను ప్రభుత్వమే దూరం చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా పాఠశాలల మూసివేతకు ఇదొక పన్నాగమని అంటున్నారు.

➡️