చేనేత రంగానికి బడ్జెట్‌ తగ్గింపు అన్యాయం

ప్రజాశక్తి – భట్టిప్రోలు : దేశవ్యాప్తంగా 1.60 కోట్ల మంది జీవనోపాధిని పొందుతున్న చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం రూ. 200 కోట్ల కేటాయించటం దుర్మార్గమని ఎపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా చేనేత పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.60 లక్షల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముష్టివేసినట్లు కేవలం రూ. 200 కోట్ల కేటాయించడం చూస్తుంటే చేనేత రంగంపై పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్ధమవుతుందన్నారు. పార్లమెంట్‌ మాజీ సభ్యులు విజరు సాయిరెడ్డి గత బడ్జెట్‌ సమయంలో కనీసంగా చేనేతకు రూ. 20 వేల కోట్ల కేటాయించాలని కోరినట్లు తెలిపారు. జనాభా దామాషా ప్రకారం చూసినా రూ. 10 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉందన్నారు. ఎన్నికల సమయంలో చేనేత రంగానికి చేనేతలకు అధిక నిధులు కేటాయిస్తామని, వారి అభివృద్ధికి కృషి చేస్తామని వేదికలపై వాగ్దానాలు చేయడంతప్ప ఆచరణలో ఎక్కడా అమలు కాలేదని బాలాజీ విమర్శించారు. బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి చేనేత కార్మికులకు, చేనేత పరిశ్రమకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా చేనేత కుటుంబాలు కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరిం చారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సభ్యులు కొడాలి రామ కోటేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం వేమూరు నియోజకవర్గ అధ్యక్షుడు బండారు శ్రీనివాసరావు, చేనేత కార్మిక సంఘం నాయకులు కె.వీరమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

➡️