జిల్లా వ్యాప్తంగా సిపిఎం నిరసనలు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : టిడిపి కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన విద్యుత్తు బిల్లులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. విజయనగరంలోని రామకృష్ణా నగర్, ఎల్‌బిజి నగర్, ముచ్చు వాణి చెరువుగట్టు , వైఎస్‌ఆర్ కాలేనీ తదితర ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని లేకపోతే బోగి మంటల్లో బిల్లులు కాలి పోయినట్టు, కూటమి ప్రభుత్వం ప్రజా ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదని హెచ్చరించారు. రూ.16,800 కోట్ల విద్యుత్తు భారాలు ప్రజలపై వేసి అదానికి స్మార్ట్ మీటర్లను కాంట్రాక్ట్ ఇచ్చి కోట్ల రూపాయలు ప్రజలు నుండి వసూలు చేయాలని నిర్ణయించారని, దాన్ని వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పి.రమణమ్మ, , బి.రమణ, జగదాంబ, శాంతమూర్తి, కృష్ణమ్మ బుచ్చయ్య, కానూరు రమణ తదితరులు పాల్గొన్నారు . వైఎస్‌ఆర్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.సురేష్, వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట :పట్టణంలోని శ్రీనివాస కాలనీలో సిఐటియు ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్తు భారాలను తగ్గించాలని కోరుతూ విద్యుత్తు బిల్లులను భోగిమంటల్లో వేసి దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.17,989 కోట్లు భారం మోపడం టిడిపి కూటమి ప్రభుత్వానికి సరికాదన్నారు. కార్యక్రమంలో సరిపిల్లి కృష్ణవేణి, మద్దిల శైలజ, మద్దిల మనిషా, సరిపల్లి ప్రవీణ్, వి శ్రీకాంత్, జి నాగచైతన్య, వి శశికాంత్, మద్దిల భరత్ కుమార్, డి.వెంకటేష్ డి.గౌరీ, రొంగలి దేవుడు, ఆర్.దేవి, లక్కోజు శ్రీను, ఎల్.వరం, సత్య పాల్గొన్నారు.
గజపతినగరం: మండలంలోని పురిటిపెంటలో విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భోగిమంటల్లో విద్యుత్ బిల్లులు వేసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు హరికృష్ణ వేణి, సిఐటియు నాయకులు జెర్రి రాము, గిరిజన సంఘ నాయకులు చిన్న రాయుడు, సతీష్, సత్యం, అసిరయ్య తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి: పెరిగిన కరెంటు ఛార్జీలను రద్దు చేయాలని, దేవాంగుల వీధి భోగిమంటలో బిల్లును సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం దహనం చేశారు. సిపిఎం నాయకులు పి. శంకర్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి పెంచమని చెప్పిన చంద్రబాబు కరెంటు ఛార్జీలు భారీగా పెంచడం ప్రజలను మోసం చేయడమే అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదానితో కుదుర్చుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని తప్పు పట్టిన టిడిపి అవే మీటర్లు ప్రజల నెత్తి మీద పెట్టడం చూస్తుంటే పార్టీలు వేరైనా వీళ్ళిద్దరూ ఆదాని సేవకుల్లాగా కనిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి పి రమణమ్మ, పోలరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని ఎం.బూర్జవలస, రంగరాయపురంలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దహనం చేేసి నిరసన తెలిపారు. సిపిఎం మండల కన్వీనర్ ఎస్.గోపాలం, సురేష్, కె.శంకర్, ప్రసాద్, మురళి, ప్రజలు పాల్గొన్నారు.
వేపాడ: మండలంలోని కేజీపూడి గ్రామంలో సోమవారం సిపిఎం జిల్లా నాయకులు చల్లా జగన్ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
నెల్లిమర్ల: పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో జరజాపుపేటలో విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కిల్లంపల్లి రామారావు, కాంగ్రెస్ నాయకులు కనకల పద్మ నాభం, మాత వెంకట రమణ పాల్గొన్నారు.
రేగిడి: పెరుగుతున్న కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని మండలంలోని వునుకూరులో భోగి మంటలో బిల్లును దహనం చేశారు. సిపిఎం నాయకులు ఎం.త్రినాధ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి పెంచమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కరెంటు ఛార్జీలను ఎలా పెంచుతారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి వి. తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.