లారీని ఢీకొట్టిన బస్సు – ఇద్దరు మృతి – ఐదుగురి పరిస్థితి విషమం

గజపతినగరం (విజయనగరం) : రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుకనుండి ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం మదుపాడ సమీపంలో జరిగింది. గజపతినగరం మండలం మదుపాడ సమీపంలో జాతీయ రహదారి పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అనీల్‌ నీరుకొండ ఇనిస్టిట్యూట్‌ డెంటల్‌ సైన్స్‌ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణీకులున్నారు. వీరంతా ఉచిత వైద్యం కోసం మల్కాజిగిరి (ఒడిశా) నుండి విశాఖకు బస్సులో బయలుదేరారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు బస్సులో చిక్కుకోవడంతో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఘటనా స్థలానికి ఐదు 108 వాహనాలు చేరుకున్నాయి. బస్సులో చిక్కుకున్న పలువురిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️