ప్రజాశక్తి-విజయనగరంకోట, బొబ్బిలి : విశాఖలో జరిగిన ప్రధాని మోడీ బహిరంగ సభకు ఆర్‌టిసి బస్సులనింటినీ అధికారులు తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేకపోవడంతో కాంప్లెక్స్ కు వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకునేందుకు నానా పాట్లు పడ్డారు. బస్సులు లేక ఉమ్మడి జిల్లాలోని ఆర్‌టిసి కాంప్లెక్సులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. విజయనగరం జిల్లాలోని విజయనగరం, శృంగవరపుకోట ఆర్‌టిసి డిపోల నుంచి ఉన్న 175 బస్సుల్లో 100 బస్సులకుపైగా, పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల నుంచి 80 బస్సులను ప్రధానమంత్రి మోడీ సభకు విశాఖకు బుధవారం తరలించారు. దీంతో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయనగరం నుంచి 24 వేల మందిని తరలించడానికి పూనుకోవడంతో ఈ ఆర్‌టిసి బస్సులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన మరో 50 బస్సులు వరకు కేటాయించారు. మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల నుంచి నాలుగు వేల మందిని తరలించాలని నిర్ణయించారు. ఈనేపథ్యంలో పాఠశాలలకు అధికారులు అనధికార సెలవు ప్రకటించడంతో విద్యాసంస్థలన్నీ వెలవెలబోయాయి. బస్సులు లేకపోవడంతో విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్సులో ప్రయాణికుల అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి ఉన్నా బస్సులు రాకపోవడంలో ప్రయాణికులు హోటల్ నుంచి కాంప్లెక్సులోనే భోజనాలు చేస్తున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. చంటి పిల్లల తల్లులు బస్సులు లేక పిల్లలతో గంటల తరబడి నిరీక్షించారు. మరోపక్క కొన్ని కళాశాలలు సెలవు ప్రకటించడంతో ఇళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు తమ లగేజీలు పట్టుకొని ప్లాట్‌ఫారాలపై నిరీక్షించారు. కొన్ని ప్రాంతాలకు పూర్తిగా బస్సులను రద్దు చేయడంతో వారికి ఏమి చేయాలో దిక్కుతోచలేదు. చివరకు గత్యంతరం లేని ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.
మోడీ సభకు పాఠశాలల బస్సులు
ప్రధాని మోడీ సభకు ఆర్‌టిసి బస్సులతో పాటు ప్రైవేట్ పాఠశాలల బస్సులను కూడా వేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇచ్చి మోడీ సభకు బస్సులు పంపించడంతో అధికారుల తీరుపై తల్లిదండ్రులు మండిపడ్డారు. పాఠశాలలకు సెలవు ఇచ్చి బస్సులు వేయడం ఏమిటని ప్రశ్నించారు. బొబ్బిలి మున్సిపాలిటీ నుంచి 9 బస్సులు వేయగా వాటిలో రెండు ఆర్టీసీ బస్సులు, మిగిలినవి ఏడు ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సులు ఉన్నాయి.
జనం తరలింపునకు పాట్లు
పాలకొండ : విశాఖపట్నంలో ప్రధాని మోడీ సభకు జనాన్ని తరలించేందుకు అధికారులు, నాయకులు నానా పాట్లు పడ్డారు. ముఖ్యంగా పాలకొండ డిపో నుంచి 41 బస్సులు ఏర్పాటుచేశారు. దీంతో బస్సులను నింపేందుకు టిడిపి కూటమి నేతలు చాలా అగచాట్లు పడ్డారు. నాయకులు, అధికారులు ఎంత ప్రయత్నించినా, ప్రజలు మాత్రం దానికి సుముఖత చూపలేదు.ప్రయాణికులకు ఇబ్బందులుమోడీ సభకు జనాన్ని తరలించడానికి డిపో పరిధిలో నుంచి 41 బస్సులు కేటాయించారు. దీంతో ప్రతిరోజూ వివిధ రూట్లలో తిరిగే బస్సులు సరిపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొత్తూరు, బామిని, వీరఘట్టం, రాజాం తదితర ప్రాంతాలకు బస్సులు లేక ప్రయాణికులు.. గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది.