ప్రజాశక్తి-శింగరాయకొండ: శింగరాయకొండలోని పిఎన్‌సిఎ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డి.నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా శింగరాయకొండ ఎస్‌ఐ మహేంద్ర హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఈ వయసులో కష్టపడి చదవాలని, ఫలితంగా ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. అది మీకు, మీ కన్న తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. జీవితంలో విద్యార్థి దశ చాలా విలువైనదని, మీరు ఈ దశలో తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలియజేశారు. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ గీతా రాణి మాట్లాడుతూ విద్యా విలువలను పెంపొందించడం కోసం ఎంతో శ్రమకోర్చి ఈ కళాశాలను స్థాపించామని, ప్రారంభంలో విద్యార్థులకు పరీక్ష ఫీజుతో సహా ఉచితంగా ఎడ్యుకేషన్ అందించామన్నారు. కళాశాల చైర్మన్ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ బాగా కష్టపడి ఉన్నత స్థితికి చేరుకున్న వారిలో ప్రస్తుతం వేదిక మీద ఉన్న ఎస్సై ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆయన ఎంతో కష్టపడి ఈ దశకు చేరుకున్నాడని ఆయనను మీరందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో స్మార్ట్‌జెన్ ప్రిన్సిపాల్ శివ, లెక్చరర్ ప్రసాద్, పల్లవి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
