పున: పరిశీలనంటూ పిలుపులు.. వికలాంగులకు అవస్థలు

Apr 10,2025 23:30

ధ్రువపత్రాల పరిశీలన కోసం ఏరియా ఆస్పత్రికి వచ్చిన వికలాంగులు, వారి సహాయకులు
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
తొలుత మంచానికే పరిమితమైన సామాజిక పింఛను పొందుతున్న వారిని, తర్వాత అంధులను, ప్రస్తుతం వికలాంగులును రీ వెరిఫికేషన్‌ (పున:పరిశీలన) పేరుతో గుర్తించేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ ప్రక్రియలో భాగంగా వికలాంగుల ధ్రువపత్రాలు, వారి వైకల్య శాతం నిర్థారణపై అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో ఉన్న వికలాంగులందర్నీ పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి రప్పించి పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా సాకులతో తమ పింఛనును తొలగిస్తారేమోననే భయం లబ్ధిదారుల్లో నెలకొంది.చిలకలూరిపేట పట్టణంలో సామాజిక పింఛను పొందేవారు 11 వేల మంది ఉండగా వీరిలో 1105 మంది వికలాంగులే. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలుత మంచానికే పరిమిమైన సామాజిక పింఛను పొందుతున్న వారి పున:పరిశీలన చేపట్టారు. అనంతరం అంధులను పరిశీలించారు. అయితే దానికి సంబంధించిన వివరాలను బహిరంగ పర్చలేదు. ప్రస్తుతం వికలాంగులను ఈనెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకూ చిలకలూరిపేటలోని ఏరియా ఆస్పత్రిలో పరిశీలనకు రావాలని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 50, సాయంత్రం 50 మంది చొప్పున రోజుకు వందమందికి చెందిన వైకల్య ధ్రువపత్రాలను పరిశీలించడంతోపాటు పరీక్షలూ చేస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు మాత్రం చేయలేదు. వచ్చిన వారు కూర్చోవడానికి, తాగునీరు వంటివి లేకపోవడంతో లబ్ధిదార్లతోపాటు వారికి సాయంగా వచ్చిన వారూ గంటల తరబడి అవస్థలు పడుతున్నారు. 15 ఏళ్లుగా పింఛను పొందుతున్న తాను వీల్‌చైర్‌మీద ఇతరుల సాయంతో పరిశీలనకు ఉదయం పూట వచ్చానని, ఈ పని ఎప్పటికి పూర్తవుతుందోనని 68 ఏళ్ల షేక్‌ ఫాతిమాతో షేక్‌ బాజీ ఆందోళన వెలిబుచ్చారు. ఇదిలా ఉండగా పింఛన్ల భారం తగ్గించుకునేందుకు అర్హులనూ వివిధ రకాల సాకులతో అనర్హులుగా చేయొద్దని లబ్ధిదార్లు వేడుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే పత్రాలను, ఇతర అంశాలను పరిశీలిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

➡️