ఎన్నికల సంగ్రామం.. పోటాపోటీగా ప్రచారం..

Apr 14,2024 00:15

గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. పోలింగ్‌కు ఇంకా నెల సమయం ఉన్నా ఎన్నికల షెడ్యూలు వెలువడిన వెంటనే ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌ గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచార బస్సుయాత్ర నిర్వహించారు. రెండ్రోజుల విరామం మధ్య దాదాపు వారం పాటు ఆయన పర్యటన కొనసాగింది. వినుకొండ, నర్సరావుపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ, మంగళగిరి నియోజకవర్గాల్లో ఆయన పర్యటన జరిగింది. బస్సు యాత్రకు భారీగానే జనసమీకరణ జరిగింది. జిల్లాలో పలువురు టిడిపి, బిజెపి నాయకులను వైసిపిలో చేర్పించడంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సఫలీకృతం అయ్యారు. జగన్‌ బస్సు యాత్రతో ఆపార్టీ అభ్యర్థుల్లో ఉత్సహం కన్పిస్తోంది. మరోవైపు టిడిపి తరుఫున ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే దాదాపుగా సగం నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలను నిర్వహించారు. తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి, తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్ల, ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో ఆయన నిర్వహించిన సభలకు ప్రజా స్పందన బాగుందని ఆ పార్టీ అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉన్నారు. గత నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించిన ఎన్‌డిఎ కూటమి సభ కూడా వైసిపి ప్రభుత్వంపై ప్రధాని మోడీ పెద్దగా విమర్శలు చేయకపోవడంతో వైసిపి నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు సభలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. సిఎం జగన్‌ సభలకు పెద్ద ఎత్తున బస్సులు ఏర్పాటు చేసి ప్రజలను తరలిస్తున్నారనే విమర్శలున్నాయి. టిటిడి, వైసిపి నుంచి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు దాదాపుగా ఖరారు కావడంతో వారంతా ఇంటింటి ప్రచారంపై దృష్టి సారించారు. ఉదయం పూట ఆత్మీయ సమావేశాలు,సాయంత్రం ఇంటింటి ప్రచారానికి అభ్యర్థులు ప్రాధాన్యత ఇస్తున్నారు. గుంటూరు లోక్‌సభ టిడిపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రచారంలో ముందజలో ఉన్నారు. వైసిపి అభ్యర్థి కిలారి రోశయ్య ప్రచారంలో కొంత వెనుకబడ్డారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మారుస్తారన్న ప్రచారం ఆయనకు శిరోభారంగా మారింది. టిడిపికి ఇది సానుకూల అంశంగా ఉంది. ఇప్పటికి వైసిపి నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు ఇప్పటికే ముగ్గురుని ఎంపిక చేశారు. తీరా రోశయ్య పోటీపై నీలినీడలు అంటూ వార్తలు రావడంతో అధికార పార్టీలో అయోమయం రాజ్యమేలుతోంది. గుంటూరు పశ్చిమలో వైసిపి అభ్యర్థి మంత్రి విడదల రజని ప్రచారంలో ముందజలో ఉన్నారు. నాలుగు నెలల నుంచి ఆమె ప్రచారం నిర్వహిస్తూ వినూత్నంగా ప్రజలను ఆకట్టుకోవడానికి నేరుగా ఇంటింటి ప్రచారంపై దృష్టి సారించారు. మంగళగిరిలో టిడిపి, వైసిపి, ఇండియా వేదిక అభ్యర్థులు నారా లోకేష్‌, మురుగుడు లావణ్య, జొన్నా శివశంకరరావు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నర్సరావుపేట లోక్‌సభ పరిధిలో వైసిపి, టిడిపి అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొ పంథాలో ప్రచారంలో ఉన్నారు. మంత్రి అంబటి రాంబాబు రోజుకో వినూత్న రీతిలో డాన్సులు, కళా సాంస్కృతిక అంశాలతో ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలిసి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. లోక్‌సభకు పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయులు, పి.అనిల్‌కుమార్‌ ఇప్పటికే తొలి విడత ప్రచారాన్ని ముగించారు. శ్రీకృష్ణదేవరాయులు సిట్టింగ్‌ ఎంపి కావడంతో ఆయన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేగంగా దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆమ్‌ఆద్మీ పార్టీ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా వేదిక ప్రచార సభ శుక్రవారం గుంటూరులో జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి తదితరులు ఈ సభలో పాల్గొని వేదిక ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.
(ఎ.వి.డి.శర్మ)

➡️