రికార్డులను పరిశీలిస్తున్న తహశీల్దార్ క్షమారాణి
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : మాచవరం మండలంలోని వేమవరం, పిన్నెల్లి గ్రామల్లోని సరస్వతీ పవర్ ప్లాంట్‌కు రిజేస్ట్రేషన్ అయిన 24.84 ఎకరాల భూమికి ఉన్న రిజిస్ట్రేషన్ల్‌ను రద్దు చేస్తునట్లు తహశీల్ధార్ క్షమారాణి బుధవారం ప్రకటించారు. 2015లో మాచవరం, దాచేపల్లి మండలాల పరిధిలో 1515.90 ఎకరాలను సరస్వతి పవర్ ప్లాంట్ నిర్మాణానికి యాజమాన్యం కోనుగోలు చేసినా ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదు. రెండేళ్ల క్రితం పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం వేమవరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. ఎన్నికల అనంతరం నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం సరస్వతి భూముల విషయంలో అవకతవకలు ఉన్నాయని ఆరోపించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతేడాది నవంబర్ 5న మాచవరం మండలం వేమవరానికి వచ్చి సరస్వతి భూముల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయని, అది ఎంతో తేల్చాలని అధికారులను ఆదేశించారు. దీనిపై అధికారులు పరిశీలించగా వేమవరంలోని 782 సర్వే నంబర్‌లో 20 ఎకరాలు, పిన్నెల్లిలోని 463-3 సర్వే నంబర్‌లో 4.84 ఎకరాలు భూమిని వెబ్‌ల్యాండ్‌లో పరిశీలించి 24.84 ఎకరాల ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలతో మాచవరం తహశీల్దార్ క్షమారాణి 24.84 ఎకరాలకు సంభందించి వేమరంలో రెండు రిజిస్ట్రేషన్లు, పిన్నెల్లిలో 4 రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. పిడుగురాళ్ల ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ సురేష్‌బాబు మాట్లడుతూ ఈ 6 రిజిస్ట్రేషన్లు 2015లో జరిగాయని, అప్పుడు ఆన్‌లైన్ వ్యవస్ధ లేకపోవడంతో ఈ రిజిస్ట్రేషన్లు జరిగాయని, 2016 సవంత్సరం నుండి ఆన్‌లైన్ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.
