మనోధైర్యంతో కేన్సర్‌ను జయించొచ్చు!

Jun 14,2024 23:43 #కేన్సర్‌
కేన్సర్‌

ప్రజాశక్తి – ఆరిలోవ : కేన్సర్‌తోపాటు ఎంతటి మహమ్మారి వ్యాధులనైనా ప్రాధమిక దశలోనే గుర్తించి, తగు చికిత్స పొందడంతోపాటు మనోధైర్యం ఉంటే ఎంతటి ప్రాణాంతక వ్యాధినైనా జయించవచ్చని అపోలో కేన్సర్‌ విభాగం వైద్యులు, కేన్సర్‌ వ్యాధిని జయించిన విజేతలు అన్నారు. శుక్రవారం ఆరిలోవ, హెల్త్‌సిటీలో ప్రపంచ కేన్సర్‌ విజేతల దినోత్సవాన్ని అపోలో కేన్సర్‌ విభాగంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఇటీవల కేన్సర్‌ వ్యాధికి చికిత్స తీసుకొని, వ్యాధిని జయించిన విజేతలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విశిష్ణ అతిధిగా నగర నేరవిభాగం డిసిపి వెంకటరత్నం పాల్గొని కేన్సర్‌ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడిన తీరు, స్పూర్తి, సంకల్పాన్ని తెలుసుకుని, వారిని అభినందించారు.ఈ సందర్భంగా సీనియర్‌ కన్సల్టెంట్‌ మెడికల్‌ ఆంకాలజిస్టులు డాక్టర్‌ రాకేష్‌రెడ్డి, డాక్టర్‌ సుమన్‌ దాస్‌ మాట్లాడుతూ వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తించి, రోగి మొండిధైర్యం, కుటుంబ సభ్యుల సహకారం ఉంటే కేన్సర్‌ వంటి భయంకర వ్యాధినైనా జయించవచ్చన్నారు. సర్జికల్‌ ఆంకాలజిస్టులు డాక్టర్‌ చంద్రకల్యాణ్‌, రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ ఆదిత్యనారాయణ్‌ మాట్లాడుతూ దృఢమైన ఆశయం ప్రాముఖ్యతను వివరించారు.. కేన్సర్‌ను జయించిన జయశ్రీ హతంగడి, రాధ, రమాబాయి, శైలజ, నికిత నాయుడు తదితరులు మాట్లాడుతూ కేన్సన్‌ను ఓడించే ప్రయాణంలో ఆరోగ్య సంరక్షణ ప్రదాతలతో పాటు కుటుంబ సభ్యుల మద్దతు, ఆసుపత్రిలో వైద్యుల అందించిన చికిత్స, మనోధైర్యాన్ని తలచుకుంటూ ఈ వ్యాధిని జయించినట్టు తెలిపారు. అపోలో ఆసుపత్రి సిఇఒ శ్రీరామచంద్ర మాట్లాడుతూ కేన్సర్‌ సంరక్షణను మెరుగు పరచడంలో అపోలో నిబద్ధతను వివరించారు.. కేన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు, వారి కుటుంబసభ్యులకు తగ్గింపుతో కూడిన కేన్సర్‌ ప్యాకేజీనిప్రకటించారు. అనంతరం రోహిత్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ సభ్యులు కేన్సర్‌ లఘ్ణునాటికను ప్రదర్శించి కేన్సర్‌ విజేతలను, కుటుంబ సభ్యులను ఆనందింపచేసారు. కార్యక్రమంలో మెడికల్‌ సూపరెంటెండెంట్‌ డాక్టర్‌ బాలక్రిష్ణ, కార్పొరేట్‌ రిలేషన్స్‌ డిజిఎం విజయసారధి, ఆంకో హెచ్‌ఒడి సత్య, డాక్టర్‌ ప్రదీప్‌, డాక్టర్‌ జయశ్రీ పాల్గొన్నారు.

కేన్సర్‌ విజేతలతో క్రైం డిసిపి వెంకటరత్నం, అపోలో వైద్యులు

➡️