జన్యుపరంగానూ కేన్సర్‌ వచ్చే అవకాశం

Jun 10,2024 00:37

మాట్లాడుతున్న డాక్టర్‌ సత్యశ్రీనివాస్‌
ప్రజాశక్తి-గుంటూరు :
కేన్సర్‌కు కారణాలు, అందుబాటులో ఉన్న చికిత్స విధానాల గురించి స్థానిక అరండల్‌పేటలోని అవగాహన కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆరోగ్య సభలో డాక్టర్‌ ఎ.సత్యశ్రీనివాస్‌ వివరించారు. ప్రస్తుతం సమాజంలో కేన్సర్‌ వ్యాధి విస్తృతంగా వ్యాపించిందని, దీనికి జన్యుపరమైన కారణాలు, మనం అనుసరిస్తున్న జీవనశైలి ముఖ్య కారణాలని అన్నారు. కొంతమందిలో ఏవిధమైన చెడు వ్యసనాలూ లేకున్నా వారికి జన్యుపరంగా కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. చాలామందిలో ధూమపానం, మద్యపానం, ప్యాసివ్‌స్మోకింగ్‌, వివిధ రకాల రసాయనాలతో పండించిన కూరగాయలను, పండ్లను వినియోగించటం, వివిధ ఆహార పదార్థాల్లో రుచుల కోసం ఉపయోగించే అజానామోటా లాంటి పదార్థాలను వివిధ ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనపడటానికి ఉపయోగించే కలర్స్‌, కెమికల్స్‌ కలిపి తయారుచేసిన ఆహారం ఉత్పత్తులను తినడం ద్వారా కేన్సర్‌ బారిన పడుతున్నారని వివరించారు. కేన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే వందశాతం నయం చేయటానికి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, అలా కాకుండా అడ్వాన్స్డ్‌ దశలో గుర్తిస్తే నయం చేయటం కష్టమవుతోందని చెప్పారు. అయితే బాధితుల జీవిత కాలాన్ని పొడిగించే అవకాశం ఉందన్నారు. రెండు భాగాలకు సంబంధించిన కేన్సర్లకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, అవి ఒకటి రంగుకు సంబంధించిన హెపటైటిస్‌బి వ్యాక్సిన్‌, రెండవది సర్వైకల్‌ కేన్సర్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ అని తెలిపారు. ఈ రెండు రకాలకు తప్ప మన శరీరంలో వివిధ భాగాలకు సంభవించే కేన్సర్లకు వ్యాక్సిన్‌ లేదని, వాటి విషయంలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ల ద్వారా కొన్ని సందర్భాల్లో తొలి దశలో గుర్తించవచ్చని చెప్పారు. ఈ స్క్రీనింగ్‌ టెస్ట్‌లలో వందశాతం తెలిసే అవకాశం ఉండదని, జనరల్‌ చెకప్‌లలో ఏదైనా కేన్సర్‌కు సంబంధించిన లక్షణాలు కనపిస్తే తదుపరి పరీక్షలు పెట్‌స్కాన్‌, బయాప్సీ లాంటి పరీక్షల ద్వారా కేన్సర్‌ను నిర్ధారించి వైద్యం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఒకసారి కేన్సర్‌ను నిర్ధారించిన తర్వాత దాని స్థితి, అది ఏ కోవకు చెందిన కేన్సరో పరిశీలించి ఏ రకమైన వైద్యం చేయాలని వైద్యులు నిర్ణయిస్తారని చెప్పారు. సాధారణంగా సర్జరీ, రేడియో థెరపీ, కీమోథెరపీ ప్రస్తుతం అనుసరిస్తున్న వైద్య విధానాలను, వీటిలో సర్జరీకి, రేడియో థెరపీకి పెద్దగా దుష్పరిణామాలు ఉండవని, హీమోథెరపీలో మాత్రం కొన్ని సైడ్‌ఎఫెక్ట్స్‌ కనబడతాయని, అవి కూడా శాశ్వతంగా ఉండేవి కాదని తెలిపారు. కేన్సర్‌ తల నుండి పాదాల వరకు మనం గమనిస్తే చర్మానికి, నోటికి, గొంతుకి, ఊపిరితిత్తులకి, బ్లడ్‌, ప్రోస్టైటిస్‌ గ్రంధికి, పొట్టలో, పేగుల్లో, మహిళలకు అండాశములలో, సర్వైకల్‌లో, రొమ్ములలో కూడా వచ్చే అవకాశం ఉన్నాయని వివరించారు. బాగా కాగిన నూనెలో వేయించిన ఆహారం తీసుకోవద్దని, ధూమపానం మానేయాలని, మద్యపానం అదుపులో ఉంచుకోవాలని, ప్రాసెస్‌ చేసిన ఆహారం, ప్యాకెట్‌ ఫుడ్‌, ఆఫ్‌ బాయిల్డ్‌ మాంసం, రెడ్‌ మీట్‌ లాంటివి తీసుకోవద్దని సూచించారు. అనంతరం అవగాహన సభ్యులు డాక్టర్‌ను ఘనంగా సత్కరించారు. సమావేశానికి కో-ఆర్డినేటర్‌గా టీవీ సాయిరాం వ్యవహరించగా, అవగాహన సీనియర్‌ సభ్యులు కె.చంద్రశేఖరరావు, ఎ.రవీంద్రకుమార్‌, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి పాల్గొన్నారు.

➡️