ఇంటి వద్దే కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు

Nov 11,2024 22:20

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ :
ఈ నెల 14వ తేదీ నుంచి ఇంటి వద్దే కేన్సర్‌ నిర్ధారణా పరీక్షలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుంచి జిల్లా కలెక్టర్‌ వైద్య ఆరోగ్య అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 14 నుండి ప్రతి ఇంటి వద్దే 18 సంవత్సరాలు నిండిన ప్రజలందరికీ అసంక్రమణ వ్యాధులలో బిపి, షుగర్‌, గుండె జబ్బులు, థైరాయిడ్‌, పక్షవాతం, బ్రెస్ట్‌ కేన్సర్‌్‌ మొదలగు వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. నిర్ధారణ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ అయితే సులభంగా చికిత్స చేయవచ్చని, ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మానవతాదృక్పథంతో క్వాలిటీగా స్క్రీనింగ్‌ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ఈనెల 8, 9 తేదీలలో జిల్లాలోని పిహెచ్‌సి సిబ్బందికి కేన్సర్‌ స్క్రీనింగ్‌ పై పూర్తి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నెల 12వ తేదీన నమూనాగా రెండు ఇళ్లను మెడికల్‌ ఆఫీసర్‌ స్క్రీనింగ్‌ చేయాలని, 13వ తేదీ ఆశా కార్యకర్తలు ఇంటింటికి కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 14 తేదీ నుంచి వ్యాధుల నిర్ధారణ పరీక్షల నిర్వహణ ప్రారంభం అవుతుందన్నారు. సిహెచ్‌ఓ, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు రోజుకి ఐదు ఇండ్లు మాత్రమే స్క్రీనింగ్‌ను క్వాలిటీగా చేయాలని తెలిపారు. కరపత్రాలు, గోడపత్రికల ద్వారా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆరోగ్య విద్యపై అవగాహన కల్పించాలని, వ్యాధులు రాకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు తెలపాలన్నారు. ఈ స్క్రీనింగ్‌ కార్యక్రమాన్ని సూపర్వైజర్‌ స్టాఫ్‌, మెడికల్‌ ఆఫీసర్లు పర్యవేక్షణ చేయాలని తెలిపారు.

➡️