ఒరిస్సా నుండి తెనాలికి గంజాయి

Jun 10,2024 23:46

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ, ముసుగులో నిందితులు
ప్రజాశక్తి తెనాలి :
చాప కింద నీరులా పట్టణాన్ని చుట్టేసిన గంజాయిని సమూలంగా అరికడతామని డీఎస్పీ ఎం.రమేష్‌ చెప్పారు. త్రీటౌన్‌ పరిధిలో 8 మంది గంజాయి విక్రేతలను అరెస్టు చేసి వారి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న సందర్భంగా సోమవారం విలేకర్లకు వివరాలు వెల్లడించారు. త్రీ టౌన్‌ పోలీసులకు ఆదివారం అందిన విశ్వసనీయ సమాచారంతో బాలాజీరావుపేటలోని ఓ ప్రైవేటు స్థలంలో గంజాయి విక్రేతలు ఉన్నారని తెలుసుకుని, సీఐ ఎస్‌.రమేష్‌బాబు ఆధ్వర్యంలో దాడి చేశారు. వారి వద్ద 2 కిలోల గంజాయి కలిగిన సంచులను స్వాధీనం చేసుకుని, ఎనిమిది మందిని అదుపులకు తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కలకత్తాకు చెందిన మహమ్మద్‌ షఫీ సత్తార్‌, పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌, సయ్యద్‌ మహమ్మద్‌ సోహైల్‌ అలియాస్‌ బట్లు, డొంక రోడ్డు కు చెందిన రాపోలు నరసింహారావు, కొమ్మ తోటి బాలరాజు, చెంచుపేటకు చెందిన జమళ్ళమూడి గోపి, పాండురంగపేటకు చెందిన దిడ్ల ప్రభుదేవా అలియాస్‌ చంటి, మారిసుపేటకు చెందిన ఆకురాతి భరత్‌ అలియాస్‌ చిన్న ఉన్నారు. నిందితుల్లో ఒకరైన మహమ్మద్‌ షఫీ సర్దార్‌ కొంతకాలం క్రితం కలకత్తా నుంచి వచ్చి పట్టణంలో ఉంటూ ఓ టైలరింగ్‌ షాప్‌లో పని చేస్తున్నాడు. అతను ఒరిస్సా రాష్ట్రంలో రెండు కిలోల గంజాయిని అతి చౌకగా కొనుగోలు చేసి, తెనాలి ప్రాంతానికి తెచ్చి నిందితులతో కలిసి చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.. ఎన్నికల సమయానికి ముందు గంజాయి పై ఆరు కేసులు నమోదు చేసి 29 మందిని అరెస్టు చేశారు. గంజాయి ఆట కట్టించేందుకు పోలీసులు పకడ్బందీగా పని చేస్తున్నారని, ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో కొంత ఆలస్యమైనా తిరిగి నిఘా ముమ్మరం చేసినట్లు డీఎస్పీ చెప్పారు. ప్రత్యేకంగా టీములు ఏర్పాటు చేసి గంజాయిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ను ఇటీవల కలిసిన సందర్భంగా గంజాయి విక్రేతలను ఉపేక్షించొద్దని, తెనాలి నియోజకవర్గంలో గంజాయి ఆనవాళ్లు కనిపించకుండా చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. పిల్లల వ్యవహార శైలిని తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలని, విద్యాసంస్థల యాజమాన్యం కూడా విద్యార్థుల కదలికను గమనిస్తూ ఉండాలని సూచించారు. గంజాయిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నిందితులను అదుపులోకి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ రమేష్‌బాబుతో పాటు ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, ప్రకాష్‌, ఎఎస్‌ఐ దేవప్రసాద్‌, కానిస్టేబుల్స్‌ పి మురళి, వి. శ్రీహరి, డి.సురేష్‌, సిహెచ్‌ రామ్మూర్తి బృందాన్ని డీఎస్పీ అభినందించారు.

➡️