ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్: ఎస్‌సి ఉప కులాలు అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి యువజన జెఏసి రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ తెలిపారు. ఒంగోలు అంబేద్కర్ భవనంలో విద్యార్థి యువజన జాగృతి ఆధ్వర్యంలో మాల, మాదిగ విద్యార్థి యువజన ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి విద్యార్థి యువజన జాగృతి రాష్ట్ర కోఆర్డినేటర్ రెబ్బవరపు ప్రేమ్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు బత్తుల సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాయపాటి జగదీష్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 59 ఉప కులాలకు 15 శాతం రిజర్వేషన్ పంచుకొని 25 శాతం రిజర్వేషన్ పెంచుకుందామన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ముఖ్య మంత్రులు వర్గీకరణ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యువజన జాగృతి రాష్ట్ర కో ఆర్డినేటర్ రెబ్బవరపు ప్రేమ్ కు మార్ మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరు తో కుల సంఘ నాయకులు మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నార న్నారు. ఈ సమావేశంలో యువజన జాగృతి అధ్యక్షుడు కొమ్ము రాజీవ్, పిల్లి మురళి, బత్తుల వెంకట్రావు బండారు శేషగిరి, గంధం బెంజిమెన్, కరుణాకర్, కృష్ణ, అశోక్ పాల్గొన్నారు.