సిసిఆర్‌ కార్డులు వెంటనే ఇవ్వాలి

Sep 10,2024 21:33
ఫొటో : ధర్నా చేస్తున్న ఎపి కౌలు రైతు సంఘం నాయకులు

ఫొటో : ధర్నా చేస్తున్న ఎపి కౌలు రైతు సంఘం నాయకులు

సిసిఆర్‌ కార్డులు వెంటనే ఇవ్వాలి

– ఎపి కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్‌

ప్రజాశక్తి ఆత్మకూరు అర్బన్‌ : కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు సిసిఆర్‌ గుర్తింపు కార్డులను వెంటనే ఇవ్వాలని అన్నివిధాల వారిని ఆదుకోవాలని ఎపి కౌలు రైతుసంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు వారు మంగళవారం ఆత్మకూర్‌ తహశీల్దార్‌ వారి కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ సుజాతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎపి కౌలు రైతుసంఘం, ఎపి రైతు సంఘం మండల కమిటీల నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో రైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తగుచర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు, కౌలురైతులు నష్టపోతున్నారన్నారు. అప్పుల పాలవుతున్నారని తెలిపారు. కౌలు రైతులకు భూమి యజమాని సంతకాలతో ముడిపెట్టి సిసిఆర్‌ కార్డులను మంజూరు చేస్తున్నారని అందువల్ల కౌలు రైతులకు గుర్తింపు కార్డులు రావడం లేదన్నారు. వ్యవసాయానికి భరోసా పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఖర్చులు రూ.20వేలు వెంటనే ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి మూడు నెలల సమయం గడుస్తున్నప్పటికీ ఇంతవరకు సదరు విషయాలపై ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు కౌలు రైతులకు ఖర్చులు వెంటనే వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని, ఈక్రాఫ్ట్‌ వాస్తవ సాగుదారులైన రైతులకు వారి పేరుతోనే నమోదు చేయాలని, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించే చర్యలను ఆపాలని, జిఒ నెంబర్‌ 22 రద్దు చేయాలని, సోమశిల ప్రాజెక్టు వద్ద దెబ్బతిన్న ఆఫ్రాన్‌ పనులను త్వరితగతిలో పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు గంట లక్ష్మీపతి, ఎపి రైతుసంఘం అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమోహన్‌, లక్కు కృష్ణప్రసాద్‌, కొండా లక్ష్మమ్మ, వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️