సీనియర్ నాయకులను పరామర్శిస్తున్న బి.వెంకట్ తదితరులు
ప్రజాశక్తి-సత్తెనపల్లి : దేశవ్యాప్తంగా రెండు కోట్ల రేషన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, పేదలను కొట్టి పెద్దలకు పెట్టే విధానాలను మరింత పెంచిన కేంద్రంలోని బిజెపిపై పోరాటానికి ప్రజలు సన్నద్దం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. సత్తెనపల్లికి శనివారం వచ్చిన ఆయన వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఉపాధి కరువై కోట్లాది మంది వేల కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు వలసలు వెళ్తుంటే వారి బాధలను పట్టించుకోని కేంద్రం రేషన్ కార్డులను రద్దు చేయడం దారుణమన్నారు. లక్ష మంది కూలీలకు ఆధార్ కార్డులూ లేవని చెప్పారు. ఆధార్ ప్రామాణికంగా తీసుకోవద్దని స్వయాన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం బిజెపి పట్టించుకోకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా ఉన్న రేషన్ కార్డును తీసివేయడం అంటే పేదలను ఆ పథకాలకు దూరం చేయడమేనని, ఇది ఆకలి బాధలు, ఆత్మహత్యల పెరుగుదలకు దారి తీస్తుందని చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తామని చెప్పిన బిజెపి పేదలను నిర్మూలించే విధానాలను అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే జాతీయ గ్రామీణ ఉపాధిలో 6 కోట్ల మంది జాబ్ కార్డులను రద్దు చేశారని, చట్టం అమలుకు నిధులనూ తగ్గించారని విమర్శించారు. గత రెండేళ్లలో ఆహార భద్రతకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు భారీ మొత్తంలో తగ్గిస్తున్నారని, తాజాగా రూ.70 వేల కోట్లు కోత విధించారని తెలిపారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఫుడ్ కూపన్ల పేరుతో నగదు బదిలీ యోచన పథకాలకు కోత పెట్టడానికేనన్నారు. ఈ విధానాలను వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఉద్యమాలకూ సిద్ధమవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు రామలింగరాజును పరామర్శించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శివనాగరాణి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.రవిబాబు, కె.రోశయ్య, నాయకులు కె.నాగేశ్వరరావు, జె.భగత్, ఏపూరి వెంకటేశ్వర్లు, జె.రాజ్‌కుమార్ డి.సుజాత పాల్గొన్నారు.
