ప్రజాశక్తి-గుంటూరు : దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్న కేరళ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు మానుకోవాలని కార్మిక, రైతు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఖండిస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం గుంటూరులోని లాడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నేతాజి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు కొల్లిరంగారెడ్డి, ఏరువాక రైతుకూలీ సంఘం నాయకులు పాడిబండ్ల కోటేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు ఆర్.అంజిబాబు మాట్లాడారు. కేరళ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు సాగు రైతులందరికీ పూర్తి రుణమాఫీ చేసి, కొత్త రుణాలు మంజూరు చేసిందని, సబ్సిడీలు పెంచి, మద్దతు ధరలు కల్పిస్తూ రైతు, కౌలు రైతులకు గిట్టుబాటయ్యే విధంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా అన్ని రకాల సబ్సిడీలు అందిస్తోందన్నారు. వ్యవసాయ కార్మికులకు రోజువారి వేతనం రూ.600 నుండి రూ.700లకు దక్కే విధంగా కృషి చేస్తోందని, కార్మికులకు కనీస వేతన నెలకు రూ.26 వేలు అమలు చేస్తోందని చెప్పారు. బలమైన సహకార వ్యవస్థను తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా చేస్తోందన్నారు. కరోనా ఉధృతిని తట్టుకొని ఇతర రాష్ట్రాలకు కూడా సహాయ సహకారాలు అందించిందని గుర్తు చేశారు. ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడలేని కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కేరళకు రావాల్సిన నిధులను నిలిపివేసిందన్నారు. వయనాడ్ తుపానుతో అతలాకుతులమై భారీ నష్టం సంభవించిన వారిని కేంద్రం ఆదుకోకపోగా, ఇతరుల నుండి సహాయం అందకుండా అడ్డుకుంటోందన్నారు. కేరళ రాష్ట్రాన్ని బలహీనపడే చర్యలకు పాల్పడే విధంగా కుట్ర చేస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరూ నిరసించాలని కోరారు. కేంద్రానికి వత్తాసు పలుకుతున్న పార్టీలూ ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు నన్నపనేని శివాజీ, ఐద్వా నాయకులు కళ్యాణి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు షేక్.సమీర్, ఆవాజ్ ఎస్‌కె.బాష, సిఐటియు నాయకులు కె.నలినీకాంత్, కె.శ్రీనివాస్, బి.లక్ష్మణరావు, కె.ముత్యాలరావు పాల్గొన్నారు.