ఉపాధి కూలీల ప‌ట్ల‌ కేంద్రం నిర్ల‌క్ష్యం : వ్య‌వ‌సాయ కార్మిక సంఘం

Mar 5,2024 16:35 #Dharna, #Kurnool, #upadi

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ఉపాధి కూలీల‌కు వేత‌నాలు చెల్లించ‌డం ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వీడాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌సాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి నారాయణ, అధ్యక్షులు వీరశేఖర్, సహాయ కార్యదర్శి తిక్కన్న, బాలకృష్ణ, రామాంజనేయులు డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం ఆదోని స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ముందు జిల్లా ఉపాధ్య‌క్షుడు లింగ‌న్న అధ్య‌క్ష‌త‌న కార్యాలయం ముందు బైఠాయించి ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేశారన్నారు ప్రతి ఏడాది బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయించాల్సి ఉండగా 60 వేల కోట్లకు కుదించడం బిజెపి ప్రభుత్వం వైఖరి తేట తేర్లమైందన్నారు కరువు మండలాలకు రావలసిన 50 రోజుల పని దినాలు కల్పించాలన్నారు. కరువు సహాయక చర్యలు భాగంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 14 రకాలు నిత్యవసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని, 200 రోజులు పని దినాలు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, కరువు మండలాల్లో కోరుతూ సీజనల్ హాస్టల్స్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పాత రెవెన్యూ డివిజన్ పరిధిలో లక్షలాదిమంది పొట్టచేత పట్టుకుని వలసలు వెళుతుంటే వలసలు నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని వారు విమర్శించారు. పత్రికల్లో మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు తప్ప ఒక్క రూపాయి కూడా మండలాలకు సహాయం అందించలేని పరిస్థితుల్లో బిజెపి, వైసిపి ప్రభుత్వాలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరువు మండలాల్లో 50 రోజులు అదనపు పని దినాలు కల్పిస్తామని కలెక్టర్ గారు ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా నేటికీ ఆచరణకు నోచుకోలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పనులు గుర్తింపులో కూడా చాలా అన్యాయంగా ప్రభుత్వం ఉందని కేవలం ఫారం పాండ్స్ మాత్రమే తవ్వాలని నిబంధన పెట్టి, పూడికతీత పనులు గుర్తించకుండా ఆ పనులు తిరస్కరిస్తున్నారని దీనివలన ఉపాధి కూలీలు పనులకు వెళ్లడం కష్ట సాధ్యమవుతుందని వారన్నారు. ఈ సంవత్సరం తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పారం పాండ్స్ తవ్వడానికి ఎర్రమట్టి నెలల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏఓ శేషయ్య కు వినతి పత్రం తీసుకోవాల‌ని కోర‌గా నిర్లక్ష్యంగా వ‌హించ‌డంతో సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బందిని నిల‌దీశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం తలుపులకు వినతి పత్రాన్ని అతికించారు. అధికారులకు కనీసం వినతిపత్రం తీసుకునే తీరిక కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు దస్తగిరి, శ్రీరాములు, సురేంద్ర, ఆదోని మండల అధ్యక్షులు రంగనాథ్, దేవనకొండ మండల కార్యదర్శి భాషా, ఆస్పరి మండల కార్యదర్శి రామాంజనేయులు, పెద్దకడూబురు మండల, తుగ్గలి మండల అధ్యక్షులు రంగరాజు అధ్యక్షులు హనుమంతు, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గోపాల్ తిప్పన్న ఉపాధ్యక్షులు లక్ష్మన్న, సిఐటియు మండల కార్యదర్శి బి వీరారెడ్డి, కోసిగి మండల సిఐటియు నాయకులు రాముడు, వ్యవసాయ కార్మిక సంఘం స్థానిక మండల నాయకులు గోవిందు, రహిమాన్, రామప్ప రైతు సంఘం నాయకులు హనుమంత్ రెడ్డి, హనుమంతు పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు నాయకులు పాల్గొన్నారు.

➡️