ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌళిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ జిల్లాలో శతశాతం క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని విజయనగరం ఎంపి, జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ ఛైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ పథకాల అమలు, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను పటిష్టం చేయడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం, వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం వంటి అంశాలపై సమన్వయం కోసం జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ ఏర్పాటయ్యింది. ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు కమిటీ ఛైర్మన్‌గా, మరో ఎంపి ఎం.శ్రీభరత్ సహాధ్యక్షుడుగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్ సభ్యులుగా నియమిస్తూ ఇటీవల ఈ కమిటీ ఏర్పాటయ్యింది. కమిటీ తొలి సమావేశం బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కమిటీ ఛైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ జిల్లాలోని ఎస్‌సి, ఎస్‌టి గ్రామాల్లో పిఎం సూర్యఘర్ యూనిట్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో ఇళ్ల పైకప్పులపై సౌరవిద్యుత్ ఫలకాల ఏర్పాటుకు స్థలం లేనట్లయితే గ్రామాల్లో పెద్ద చెరువుల గట్లపై సౌరవిద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో గ్రామాన్ని ఎంపికచేసి సౌరవిద్యుత్ గ్రామంగా రూపొందించేందుకు ప్రయత్నించాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పి.ఎం.సూర్యఘర్ పై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు ముందుగా తమ గ్రామాలను సంపూర్ణ సౌరగ్రామాలుగా రూపొందించడం ద్వారా ఇతర గ్రామాలకు ప్రేరణగా నిలవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంత్రి పాల్గొన్నారు. పిఎం కుసుమ్ ద్వారా వ్యవసాయానికి సౌరవిద్యుత్ సరఫరా, అన్ని గ్రామాలకు 24 గంటలపాటు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాపై మంత్రి విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్‌ఇ లక్ష్మణరావు ద్వారా తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే మూడు నెలల్లో 10వేల పి.ఎం.సూర్యఘర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఇ ఎం.లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లాలో పి.ఎం.కుసుమ్ పథకం కింద వ్యవసాయ ఫీడర్లకు సౌరవిద్యుత్ సరఫరాతో అనుసంధానం చేసేందుకు, సౌరవిద్యుత్ విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు 64.7 ఎకరాలను గుర్తించామని తెలిపారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటులో భాగంగా జిల్లాలో 1,08,629 స్మార్ట్ మీటర్లను ప్రభుత్వ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు, 11 కె.వి.ఫీడర్లకు ఏర్పాటు చేశామని చెప్పారు. సమావేశంలో విద్యుత్ పంపిణీ సంస్థ డిఇలు హరి, త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.
