ప్రజాశక్తి – తుళ్లూరు : రాజధాని అమరావతి నిర్మాణానికి చట్టబద్దత కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి హెచ్ బాబురావు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలన్నారు. రాజధాని ప్రాంతం తుళ్లూరులోని హెచ్ ఎస్ ఆర్ కల్యాణ మండపంలో శుక్రవారం సిపిఎం రాజధాని డివిజన్ మూడవ మహాసభ జరిగింది. సభలో బాబూరావు మాట్లాడుతూ.. గతంలో వైసిపి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి తిలోదకాలిచ్చి మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంతో అనిశ్చితి వాతావరణం నెలకొందని, భవిష్యత్ లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా అలాంటి పరిస్థితి తలెత్తకుండా చట్టబద్దత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాల్చిన అవసరం ఉందన్నారు. రాతపూర్వకంగా హామీ ఇవ్వనందున రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వం అనడం దారుణమన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పదేళ్ల పాలనలో మాటలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు చేసిందేమీ లేదని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. మోడీ తో జతకట్టి రాష్ట్రాన్ని, అమరావతి అభివృద్ధిని వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ 15 వేల కోట్లు, హడ్కో ఇతర ఆర్ధిక సంస్థల నుంచి మరో రూ 15 వేల కోట్లు
నిధులు వస్తాయని కూటమి ప్రభుత్వం చెబుతోందని, ఇప్పటికే రాష్ట్రం అప్పు రూ.15 లక్షల కోట్లు ఉందని అంటూ మళ్లీ అప్పులు చేయడం సరైంది కాదని అన్నారు. రూ .15 వేల కోట్లు అప్పుగా కాకుండా గ్రాంటుగా ఇవ్వాలని కోరారు. విభజన హామీల చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిదే నన్నారు. రాజధాని అమరావతి లో ఉపాధి కల్పనకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించాలని, ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్నారు. రాజధానిలో రైతుల కిచ్చిన ప్లాట్ల పై బ్యాంకులు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధానిలో ఉచిత విద్య, వైద్యం తదితర హామీలను అమలు చేయాలన్నారు. విద్యుత్ ఒప్పందం విషయంలో మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డికి రూ 1750 కోట్లు ముడుపులు అందాయన్నవ్యవహారంపై కేంద్రం తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తోందని అన్నారు. సదరు ఒప్పందాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పక పోవడంలోని మర్మం ఏమిటని నిలదీశారు. రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీలు, ఇతర వర్గాల సమస్యలపై సిపిఎం అనేక పోరాటాలు చేసిందని, మున్ముందు కూడా కొనసాగిస్తుందని చెప్పారు. అంబానీ, ఆదానీ లకు ప్రజా సంపదను దోచిపెడుతున్న బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
ఈ మహాసభలో సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ.. మొన్నటి లోకసభ ఎన్నికలలో సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన బిజెపి నాయకులు సరిపడా సీట్లు రాక నితీష్ కుమార్, చంద్రబాబు మద్దతు పొందవలసి వచ్చిందన్నారు. బిజెపి బలం 303 సీట్లు నుంచి 240కి తగ్గాయని, సిపిఎం చొరవతో 28 పార్టీ లతో ఇండియా కూటమి ఏర్పాటు అందుకు కారణమన్నారు. రాష్ట్రంలో కూటమి పాలనలో కూరగాయలు, పెట్రో ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు చేయడం లేదని, ఇసుక అందక భవన నిర్మాణ కార్మికులకు 15 రోజులకు మించి పనులు దొరకడం లేదని అన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో రూ 35 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపితే ఐదు నెలల్లో కూటమి ప్రభుత్వం రూ . 20వేల కోట్ల భారం మోపిందని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా బిజెపి మతతత్వాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య విద్వేషాలను రేకెత్తిస్తోందని మండిపడ్డారు. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్చిన అవసరం ఉందన్నారు. అన్ని శాఖల సమన్వయం తో పనిచేసి సిపిఎం బలోపేతం కు కృషి చేసులన్నారు. సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి కార్యదర్శి నివేదికను సభలో ప్రవేశపెట్టారు. తొలుత సిపిఎం జెండాను, అమరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తో పాటు పలు ఉద్యమాలలో,ఇజ్రాయెల్ దాడులలో మృతి చెందిన వారికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై నేతాజీ, ఈమని అప్పారావు, జిల్లా కమిటీ సభ్యులు బి లక్ష్మణ రావు, ఎం భాగ్య రాజు, అధ్యక్ష వర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు, కుంభా ఆంజనేయులు,పేరం బాబురావు, జె నవీన్ ప్రకాష్ పాల్గొన్నారు.