విజయవాడ : వరదలో మునిగిన రాష్ట్రాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు ధ్వజమెత్తారు. సోమవారం విజయవాడ వరద ప్రాంతమైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ (కండ్రిక కాలనీ)లో బాబురావు సిపిఎం నేతలు పర్యటించారు. కండ్రికలో భోజన కేంద్రం నేడు ప్రారంభమైంది. గత 12 రోజులుగా సిపిఎం భోజనం కేంద్రాలు నడుపుతోంది. నేటితో 1,20,000 మందికి భోజనం అందించారు. కండ్రిక కాలనీలో ప్రజలు తమ వరద కష్టాలను బాబురావుకు వివరించారు.
వరద బాధితుల పట్ల పాలకుల నిర్లక్ష్యం కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలే తప్ప ఇంకేమీ మిగల్లేదని తమ గోడు వెళ్ళబుచ్చారు. కుట్టు మిషన్లతో స్వయం ఉపాధి పొందుతున్న మహిళలను నేతలు పరామర్శించారు, మిషన్లు దెబ్బతిని వేలాది రూపాయల నష్టపోయామని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ … ఎన్నికల ప్రచారంలో మోడీ తమ కూటమిని గెలిపిస్తే రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మాట ఇచ్చారని, వరదలు వచ్చి 15 రోజులు గడిచినా కేంద్రం, మోడీ ఎందుకు నిధులు విడుదల చేయరు ? అని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారని ఆరోపించారు. వరదలో మునిగిన రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. బిజెపి నేతలు ప్రజాప్రతినిధులుగా ఉన్నా, నోరు విప్పటం లేదని మండిపడ్డారు. తెలుగుదేశంపై ఆధారపడిన కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి చేయడంలో విఫలమవుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహాయంపై నోరు విప్పటం లేదన్నారు. ఒకరినొకరు విమర్శించుకోవడమే తప్ప, రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు రప్పించడంపై ఉమ్మడి కఅషి లేదని చెప్పారు. కేంద్రం నిర్లక్ష్యం వీడకపోతే ఉమ్మడిగా ఒత్తిడి తేవడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. బాధితులకు ఆర్థిక సహాయం అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన తగదు. తక్షణమే ఆర్థిక సహాయం అందించి బాధితులను కాపాడాలని డిమాండ్ చేశారు.
బాధితులే ఆహార పంపిణీ నిలిపివేయాలని కోరారని, మున్సిపల్ మంత్రి చెప్పటం శోచనీయమన్నారు. నాణ్యమైన బియ్యం, సరుకులు ఇవ్వాలని, నాణ్యమైన ఆహారం అందించాలని, ఇంటింటికి అందించాలని బాధితులు కోరారు… అంతే తప్ప ఆహార పంపిణీ ఆపాలని కోరలేదని అన్నారు. ఆహారం, నాణ్యమైన బియ్యం, సరుకులు ఇవ్వరు. ప్రజలు, బాధితులు ఎలా బతకాలి ? అని ప్రశ్నించారు. బాధితులపైనే నింద వేయటం తగదు అని అన్నారు. నగరపాలక సంస్థ బాధితులను ఆదుకోవటం వదిలేసి, 15 రోజుల్లో పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేయటం గర్హనీయమన్నారు. నగరపాలక సంస్థలోని పాలకపక్షం, ప్రజా ప్రతినిధులు బాధితులను పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపించారు. వరద ప్రాంతాల్లోని కూటమి శాసనసభ్యులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని అన్నారు. భారీ మెజారిటీలతో గెలిపించినా, ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. స్వయం ఉపాధితో జీవించే మహిళలను, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి తగిన విధంగా ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పాఠశాలలు, కాలేజీలు తిరిగి గాడిలో పడే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని, అరకొర సౌకర్యాలతో వదిలేయకూడదన్నారు. సిపిఎం ఒకవైపున భోజనం అందిస్తూ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, బాధితులకు అండగా నిలుస్తున్నదన్నారు. నేడు జరిగిన ఈ భోజన పంపిణీ, పర్యటనలో సిపిఎం నేతలు కే దుర్గారావు, ఏ వెంకటేశ్వరరావు, ఝాన్సీ, పీర్ సాహెబ్, వెంకటరెడ్డి, పిచ్చమ్మ, సావిత్రి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.