ప్రజాశక్తి- సీతమ్మధార (విశాఖపట్నం) : విశాఖపట్నం పోర్టు హాస్పిటల్‌ను పిపిపికి ఇవ్వొద్దంటూ సిఐటియు ఆధ్వర్యాన పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ వద్ద మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు, యునైటెడ్ పోర్టు అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు విఎస్ పద్మనాభరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రస్తుతం 80 పడకలతో సమర్థవంతంగా నడుస్తోందన్నారు. పోర్టు అండ్ డాక్ అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు, ఫ్యామిలీ పెన్షనర్లకు, పూల్ కళాసీలకు, సిహెచ్‌డి క్యాజువల్ కార్మికులకు, సిఐఎస్‌ఎఫ్ ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు దశాబ్దాల తరబడి సేవలందిస్త్తోందన్నారు. అటువంటి హాస్పిటల్‌ను పిపిపి పద్ధతిలో ”మల్టీ డిసిప్లైనరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్”గా 300 పడకలతో ప్రయివేటు వారికి ఇవ్వాలనే నిర్ణయం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని సిఐటియు వ్యతిరేకిస్తోందన్నారు. పోర్టుల్లో పిపిపి/బిఒటి విధానాలు విఫలమయ్యాయని గతంలో కాగ్ మొట్టికాయలు వేసిన విషయాన్ని గుర్తుచేశారు. కార్మిక కుటుంబాలకు వైద్య ఖర్చులు తగ్గించాలన్న నెపంతో ప్రయివేట్ వారికి కట్టబెడతామన్న దుర్మార్గపు ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ‘మెరుగైన వైద్యం అందించడం యాజమాన్యం బాధ్యత- పొందడం ఉద్యోగ, కార్మికుల హక్కు’ అన్నారు. పోర్టుల హాస్పిటల్స్ విషయమై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఫెడరేషన్ల అభిప్రాయాలు తెలుసుకొనే ముందుకు వెళ్తామని గతంలో హామీ ఇచ్చిన ఐపిఎ మాట తప్పిందన్నారు. ఎపి హైకోర్టు కూడా హాస్పిటల్ విషయమై కార్మిక సంఘాల అభిప్రాయాలను తీసుకోవాలని చెప్పిందని గుర్తు చేశారు. పోర్టుకు ఈ ఏడాది రూ.386 కోట్లు లాభాలు వచ్చాయని, వేల కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్స్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వాటి నుంచి పోర్టు హాస్పిటల్‌ను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సత్యనారయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి వి రామలింగేశ్వరరావు, విడిఎల్‌బి అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జక్కన్న సత్యనారాయణ, వీర రాఘవులు, రిటైర్డ్ ఉద్యోగులు నాయకులు రామారావు తదితరులు పాల్గొన్నారు.
పోర్టు హాస్పిటల్‌ను పిపిపికి ఇవ్వొద్దంటూ రిలే దీక్ష
