నరసరావుపేటలో సిడిపిఓ కు వినతిపత్రం ఇస్తున్న అంగన్వాడీలు, యూనియన్ నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు : అంగన్‌వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గుంటూరు జిల్లాలోని పలు మండలాలు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సోమవారం ధర్నాలు చేసి అధికారులకు వినతిపత్రాలిచ్చారు. గుంటూరులోని ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నాలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి పి.దీప్తి మనోజ, సిఐటియు నగర కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అంగన్వాడీలు 42 రోజులుపాటు సమ్మె చేసిన సందర్భంగా అప్పటి ప్రభుత్వం 2024 జులై నెల నుండి నుండి జీతాలు పెంచుతామని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చుతామని హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంతవరకు హామీని అమలు చేయలేదని అన్నారు. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీలను క్రమబద్ధీకరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి అమలు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. గుంటూరు నగరంలో హెల్పర్ పోస్ట్లు ఖాళీలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సిడిపిఒ కష్ణవేణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమానికి యూనియన్ గుంటూరు ప్రాజెక్టు అధ్యక్షురాలు చిన్న వెంకయామ్మ అధ్యక్షత వహించగా నాయకులు పద్మ, బాజీబి, కష్ణకుమారి, ప్రసన్న, సంకీర్తి, జానీ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పల్నాడు : జిల్లాపల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పీడీ కార్యాలయం వద్ద ధర్నాలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కెపి మెటిల్డాదేవి మాట్లాడారు. అనంతరం సిడిపిఒ ఉమామహేశ్వరికి వినతి పత్రం అందజేశారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, యూనియన్ నాయకులు నిర్మల, మాధవి, విజయలక్ష్మి, తులసి, పద్మ, ధనలక్ష్మి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – ప్రత్తిపాడు : స్థానిక ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీల ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షులు ప్రేమలత మాట్లాడారు. హామీలను అమలు చేయకుంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉండగా సమ్మె శిబిరాలకు వచ్చి మద్దతిచ్చిన వారు ఇప్పుడు విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ, సూపర్వైజర్ పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టడం లేదని, జిల్లాలో యూనియన్ ఆందోళన చేపట్టిన తర్వాత హెల్పర్ పోస్ట్లు ప్రమోషన్లు నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. నాయకులు కరీమున్, శ్రీవాసవి, శశికళ, అనురాధ, పద్మ, పార్వతి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మంగళగిరి : స్థానిక అంగన్వాడి కార్యాలయం వద్ద నిరసనలో సిఐటియు నాయకులు వి.దుర్గారావు, ఎం.బాలాజీ మాట్లాడారు. మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మారుస్తూ జీవో ఇవ్వాలని కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగులో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. నాయకులు హేమలత, రుక్మిణి, సరళ, సుజాత, మేరీ, కోటేశ్వరి పాల్గొన్నారు.
గుంటూరులో వినతిపత్రం ఇస్తున్న నాయకులు
