జ్యోతిరావు పూలే స్ఫూర్తితో చంద్రబాబు పాలన

Nov 28,2024 18:37 #minister, #nandhyala

ప్రజాశక్తి – నంద్యాల అర్బన్ : మహత్మా జ్యోతీరావు పూలే స్ఫూర్తితో సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని, ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన తరగతుల వారికి రూ.39 వేల కోట్లపైగా నిధులు కేటాయించడమే ఇందుకు ఉదాహరణ అని చంద్రబాబు రాకతో బీసీలకు మంచిరోజులు వచ్చాయని రాష్ట్ర న్యాయశాఖ- మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. జ్యోతీరావు పూలే వర్ధంతి సందర్భంగా నంద్యాల స్థానిక పద్మావతి నగర్ దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్తల్లో మహాత్మా జ్యోతిరావు పూలే ముందు వరుసలో ఉంటారన్నారు. అణగారిన వర్గాలు, స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన జ్యోతిరావు పూలే అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో మహిళోద్ధరణకు చివరి వరకూ రాజీలేని పోరాటం చేసిన మహనీయుడన్నారు. ఆయన స్ఫూర్తితోనే అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేశారన్నారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు తీసుకొచ్చారన్నారు. ఎన్టీఆర్ బాటలో నడుస్తున్న సీఎం చంద్రబాబునాయుడు తన పాలనలో బీసీలకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. బీసీలు ఆర్థికంగా బలపేతమయ్యేలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.

బీసీలను అణగదొక్కిన జగన్

రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారిని జగన్ తీవ్రంగా, అన్ని రకాలుగా అణగదొక్కారని మంత్రి ఎన్ఎండి ఫరూక్ మండిపడ్డారు. ఒకవైపు బీసీ సబ్ ప్లాన్ నిధుల గురించి పట్టించుకోకపోవడమే కాకుండా మరో వైపు బీసీ బిడ్డల చదువుకు విఘాతం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వం ఎంజేపీ స్కూళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిందన్నారు. ఆ తరవాత వచ్చిన 70 నుంచి 80 శాతం భవనాలను కూడా పూర్తిగా నిలిపేశారన్నారు. హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ బిల్లులను సైతం చెల్లించలేదన్నారు. జగన్ కు ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వేయడంపై ఉన్న శ్రద్ధ భవనాల నిర్మాణాలు పూర్తిచేయడంపై లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి ఫరూక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️