కేంద్రమంత్రిగా చంద్రశేఖర్‌!

Jun 9,2024 00:10

గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రిగా ఆదివారం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. కేంద్రంలో ఏర్పాటు కానున్న ఎన్‌డిఎ ప్రభుత్వంలో టిడిపి, జనసేన కూడా భాగస్వామ్యం కావాలని తీసుకున్న నిర్ణయంతో గుంటూరు ఎంపి పెమ్మసాని చంద్రశేఖర్‌కు తొలిజాబితాలో స్థానం దక్కింది. టిడిపి అధినేత ఎన్‌డిఎకు ప్రతిపాదించిన జాబితాలో పెమ్మసాని పేరు కూడా ప్రముఖంగా ఉంది. ఈ ప్రతిపాదనను నరేంద్ర మోడీ ఆమోదించారని, ఎన్‌డిఎ కూటమి చర్చల్లో టిడిపికి ఇచ్చే మంత్రి పదవుల్లో పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరు ఖరారైనట్లు గుంటూరులో ఎంపి కార్యాలయానికి సమాచారం అందింది. ఈ మేరకు చంద్రశేఖర్‌ అనుచరులు శనివారం సాయంత్రం ఢిల్లీ పయనమయ్యారు. రాష్ట్రంలో విజయం సాధించిన ఎంపిల్లో గుంటూరు ఎంపి పెమ్మసానికి అత్యధిక మెజార్టీ రావడం, అసెంబ్లీ అభ్యర్థుల విజయానికి తోడ్పడటం, పార్టీకి విధేయుడుగా ఉండటం వల్ల చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిసింది. మొత్తం పోలయిన ఓట్లలో చంద్రశేఖర్‌కు 8,64,948 ఓట్లు రాగా వైసిపి అభ్యర్థి కిలారి రోశయ్యకు 5,20,253 ఓట్లు వచ్చాయి.మొత్తం 3,44,695 ఓట్ల భారీ ఆధిక్యతతో ఆయన విజయం సాధించారు.ప్రవాసాంధ్రుడిగా రాజకీయాల్లోకి వచ్చిన చంద్రశేఖర్‌ గుంటూరు నుంచి పోటీ చేయాలని నిర్ణయర తీసుకున్న కొద్ది రోజుల్లోనే ప్రజల దృష్టిని ఆకర్షించారు. వినూత్నంగా ఆయన ప్రచారం ప్రారంభించారు. ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులతో సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోయారు. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.5780 కోట్ల ఆస్తులను చూపడం ద్వారా దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా పేరొందారు. అయితే తన ఆస్తులను నిజాయితీగా చూపారని టిడిపి వర్గాలు ఆయన్ను ప్రశంసించాయి. ఎన్నికల్లో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రశేఖర్‌కు నాలుగుచోట్ల ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత ప్రతి రౌండ్‌లోనూ చంద్రశేఖర్‌ ఆధిక్యత కనబర్చారు. ఇదిలా ఉండగా పదేళ్ల తరువాత ఉమ్మడి జిల్లాకు కేంద్ర మంత్రి పదవి దక్కనుంది. అప్పటి బాపట్ల ఎంపి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు యుఎన్‌పిఎ ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా అవకాశం దక్కింది. గుంటూరు ఎంపీగా గెలిచిన వారిలో కేంద్ర మంత్రి పదవి పొందిన వారిలో దాదాపు 50 ఏళ్లక్రితం కొత్త రఘురామయ్య ఒక్కరే కావడం గమనార్హం. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నరసరావుపేట నుంచి గెలుపొందిన కాసు బహ్మనందరెడ్డి, బాపట్ల నుంచి గెలిచిన దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మీ కేంద్ర మంత్రులుగా పనిచేశారు. యుపిఎ హయాంలో రాజ్యసభ సభ్యుడు జెడి శీలం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2024 వరకు జిల్లా నుంచి ఎవ్వరూ కేంద్రమంత్రి పదవి పొందలేకపోయారు.

➡️