కేంద్ర సహాయ మంత్రిగా చంద్రశేఖర్‌

Jun 10,2024 00:46

డాక్టర్‌ చంద్రశేఖర్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : కేంద్ర సహాయ మంత్రిగా గుంటూరు ఎంపి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆదివారం రాత్రి ఢిల్లీనిలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఆంగ్లంలో ప్రమాణం చేశారు. అనంతరం నరేంద్ర మోడీ, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం డాక్టర్‌ పెమ్మసాని స్పందిస్తూ తనకు అప్పగించిన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. పెమ్మసాని ప్రమాణస్వీకారం సందర్భంగా టిడిపి కార్యాలయాల వద్ద బాణసంచా కాల్చి కార్యకర్తలు, నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 50 ఏళ్ల తరువాత గుంటూరు ఎంపికి కేంద్రమంత్రి పదవి దక్కింది. గతంలో ఉమ్మడి జిల్లా నుంచి కేంద్ర మంత్రులుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి పురంద్రీశ్వరి, పనబాక లక్ష్మీ, జెడి శీలం పనిచేశారు. దాదాపు 10 ఏళ్ల తరువాత ఉమ్మడి జిల్లాకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు, జిల్లాకు చెందిన పలువురు టిడిపి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనూహ్యంగా అందలం ఎక్కిన చంద్రశేఖర్‌ తెనాలి మండలం జిల్లాలోని బుర్రిపాలెం గ్రామంలో 1976 మార్చి 7న జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదివారు. అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ-సినారు హాస్పిటల్‌లో ఐదేళ్లపాటు వైద్యుడిగా కూడా పనిచేశాడు. ప్రపంచ వ్యాప్తంగా జయప్రదంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారవేత్తలకు అమెరికాలో ప్రసిద్ధి చెందిన ఫోర్బ్స్‌ సంస్థ అవార్డులను అందిస్తుంది. ఫోర్బ్స్‌ నుండి ఆయన 2020 సంవత్సరంలో ప్రతిష్టాత్మక ‘ఎర్నేస్ట్‌ ఎంటర్ప్రెన్యూర్‌’ అవార్డును అందుకున్నారు. అమెరికాలోని అనీక ప్రతిష్టాత్మక మీడియా సంస్థలైన మీడియం, సీఈఓ వరల్డ్‌, ఫాస్ట్‌ మాగజైన్లు కూడా అవార్డులు అందించాయి. ఎఎస్‌యు, జిఎస్‌వి సమ్మిట్‌ నుండి ఆయన సన్మానం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సేవలను దృష్టిలో ఉంచుకోని సదరు సంస్థలు ఆయనకు తమ సభ్యత్వాన్ని ఇచ్చాయి. భారతీయ మూలాలు కలిగిన అమెరికా ఫిజిషియన్‌ అసోసియేషన్‌లో సైతం ఆయన సభ్యుడుగా ఉన్నారు. ఉచిత వైద్య సేవలు : వైద్య బీమా లేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రవాస భారతీయులకు అమెరికా దేశంలోని డల్లాస్‌ నగరంలో పెమ్మసాని ఫౌండేషన్‌ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు. నాటి ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ప్రజల తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు 2010 నుండి సుమారు 100 వరకు ఉచిత బోర్‌ వెల్స్‌ ఏర్పాటు, ఆర్వో ప్లాంట్‌లు ఏర్పాటు, ఓవర్‌ ట్యాంకుల నిర్మాణం, తాగునీటి ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారు. తన స్వగ్రామమైన బుర్రిపాలెంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం నిమిత్తం భూమిని ఉచితంగా అందించారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు చదువుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేస్తున్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద విద్యా సేవలు అందిస్తున్న సంస్థలకు ఇతోదిక విరాళాలను అందిస్తున్నారు. అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో సైతం వారు పలు సంస్థలకు తమ ఆర్థిక తోడ్పాటును అందించారు. 2010 నుండి టిడిపి ఎన్‌ఆర్‌ఐ విభాగం తరఫున పనిచేస్తూ తన విరాళంతోపాటుగా, ప్రవాసాంధ్రులు నుండి కూడా విరాళాలు సేకరించారు. పెమ్మసాని ఫౌండేషన్‌ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను పాదయాత్ర సమయంలో చూసిన చంద్రబాబు.. డాక్టర్‌ చంద్రశేఖర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్‌ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనా చివరి దశలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నాటి మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావుకు టికెట్టు కేటాయించారు. 2019లోనూ చంద్రశేఖర్‌ నరసరావుపేట టిక్కెట్‌ కోసం ప్రయత్నించినా చివరికి ఇటీవల ఎన్నికల్లో గుంటూరు ఎంపి టిక్కెట్‌ దక్కింది. వైపిపి అభ్యర్థి కిలారి రోశయ్యపై 3,44,695 ఓట్ల ఆధిక్యతో చంద్రశేఖర్‌ భారీ విజయం సాధించారు.

బుర్రిపాలెం టు ఢిల్లీ!
పేరు : డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌తల్లి దండ్రుల పేర్లు : సువర్చల, సాంబశివరావుస్వగ్రామం : బుర్రిపాలెం గ్రామం, తెనాలి మండలం , గుంటూరు జిల్లా పుట్టిన తేదీ : 07.03.1976విద్యార్హతలు : ఎమ్‌డి ( జనరల్‌ మెడిసిన్‌ ) భార్య పేరు : డాక్టర్‌ శ్రీరత్న సోదరుడు : రవిశంకర్‌ సంతానం : ఒక కుమారుడు, ఒక కుమార్తెకుటుంబ నేపథ్యం : స్వగ్రామమైన బుర్రిపాలెంలో రైతు కుటుంబం. తండ్రి సాంబశివరావు వ్యాపార రీత్యా బుర్రిపాలెం నుండి ఒకప్పటి గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు వెళ్లి స్థిరపడ్డారు. నర్సారావుపేట వాసులకు ఆయన రాజకీయంగా సుపరిచితుడే. టిడిపి స్థాపించిన నాటినుండి రెండు దశాబ్దాలు పాటు పార్టీకి విశిష్ట సేవలందించారు. డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ తన పదవ తరగతి వరకు నరసరావుపేట మున్సిపల్‌ స్కూల్‌లోను, ఇంటర్మీడియట్‌ గుంటూరులోను పూర్తి చేశారు. ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో, తెలుగు మీడియంలో చదివినప్పటికి ఆయన పట్టుదలతో చదివి 1993-94 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుండి 60 వేల మంది విద్యార్థులు ఎంసెట్‌ పరీక్షకు హాజరు కాగా రాష్ట్రస్థాయిలో ఆయన 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబిబిఎస్‌ పూర్తి చేశారు. తదనంతరం ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్లిన ఆయన మెడికల్‌ పీజీ, ఇంటర్నల్‌ మెడిసిన్‌ లను పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గైసింగర్‌ వైద్య కేంద్రం నుండి పూర్తి చేయడమే కాకుండా అక్కడ కూడా అత్యధిక మార్కులు సంపాదించి తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. పీజీ శిక్షణా సమయంలో సైతం అమెరికా దేశంలో జరిగే వైద్య విద్య విజ్ఞానపు పోటీల్లో పెన్సిల్వేనియా రాష్ట్రం తరఫున పాల్గొన్న అయన వరుసగా రెండుసార్లు అవార్డులు అందుకున్నారు. తదనంతరం జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీలోని సినాయి హాస్పిటల్‌లో ఐదేళ్లపాటు విద్యార్థులకు వైద్య విద్య బోధకుడుగాను ఫిజీషియన్‌గాను సేవలందించారు. ఇతర దేశాల నుండి అమెరికాలో వైద్యులుగా పని చేసేందుకు వెళ్లేవారు యునైటెడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అమెరికా యునైటెడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జాం (యుఎస్‌ఎంఎల్‌ఈ) పూర్తి చేసేందుకు వెళ్ళిన అయన సరైన వసతుల్లేక, తగిన శిక్షణ లభించక అనేక వ్యయప్రయాసలకు లోనయ్యారు. నాటి లెక్కల ప్రకారం శిక్షణా ఖర్చే 5 వేల డాలర్లు. ఈ పరీక్షలు పూర్తి చేయడంలో వైద్యులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లైన వసతి భారం, శిక్షణలో నాణ్యతా లోపం, భారీగా శిక్షణా వ్యయంవంటి స్వీయ అనుభవాలను దష్టిలో పెట్టుకుని అయన తన 25 ఏళ్లప్పుడు 2001లో వైద్య విద్యార్దులు ఎవరూ తనలా ఇబ్బందులు ఎదుర్కొకూడదని భావించి తన శిక్షణలో భాగంగా తాను రూపొందించుకొన్న నోట్స్‌ సాయంతో 250 ప్రశ్నలతో ఒక పుస్తకాన్ని రాశారు. దీని ప్రచురణకు అమెరికాలోని ముద్రణాలయాలను సంప్రదించినప్పటికీ వారు ముందుకు రాలేదు. అమెరికాలో సాఫ్ట్వేర్‌ రంగం వేళ్లూనుకొంటున్న తరుణంలో తన సతీమణి డాక్టర్‌ శ్రీరత్న, సాఫ్ట్వేర్‌ నిపుణులు అయిన కుటుంబ సభ్యులైన రవిశంకర్‌, కోనేరు శ్రీకాంత్‌ సహకారంతో తన పుస్తకాన్ని ఇంటర్‌నెట్‌లో ఉంచారు. దీని ధర కేవలం 20 డాలర్లుగానే నిర్ణయించారు. ఈ పుస్తకానికి వైద్యవిద్యా రంగం నుండి అపూర్వమైన స్పందన లభించింది. ఆ ప్రేరణతోనే ఆయన వైద్య విద్యార్థుల కోసం అమెరికాలో లైసెన్సింగ్‌ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థులకు స్వల్ప రుసుముతో అత్యంత నైపుణ్యంతో కలిగిన, అనుభవజ్ఞులైన, అంకితభావంతో కూడిన బోధనా సిబ్బందితో కలిసి తాను ఫౌండర్‌, సీఈఓగా ‘యూ వరల్డ్‌’ పేరుతో సంస్థను స్థాపింఛి ఆన్లైన్‌ శిక్షణ ఇస్తున్నారు. అమెరికాలో మంచి ఖ్యాతి గడించిన తన సంస్థ ద్వారా ఆయనక అనేక మందికి ఉపాధి కూడా కల్పించారు. ప్రస్తుతం ఈ సంస్థ వైద్యం, నర్సింగ్‌, ఫార్మసీ, న్యాయవాదం, వాణిజ్యం ,అకౌంటింగ్‌ విభాగాల్లో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణను అందిస్తోంది. 48 ఏళ్ల పెమ్మసాని యూ వరల్డ్‌ సంస్థ వ్యవస్థాపకుడు. ఈ సంస్థ సిఈవో కూడా ఆయనే. దీంతో పాటు టీడీపీ ఎన్నారై సెల్‌లో కూడా యాక్టివ్‌గా ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్‌ 2020లో యుఎస్‌లో యువ పారిశ్రామికవేత్తగా ఎర్నెస్ట్‌, యంగ్‌ అవార్డును గెలుచుకున్నారు. పెమ్మసాని ఫౌండేషన్‌ని కూడా స్థాపించారు. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8,360 మంది అభ్యర్థుల్లో పెమ్మసాని అత్యధిక ఆస్తులు కలిగి ఉన్నారు. రూ.5780 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నుంచి ఆయన తన సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి కిలారి రోశయ్యపై 3,44,695 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొద్ది రోజులకే ఆయన గుంటూరు నుంచి పోటీ చేసి భారీ ఆధిక్యతతో గెలిచారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

➡️