ప్రజాశక్తి-తర్లుపాడు: నకిలీ పురుగుమందులతో రైతన్నలు నష్టాల ఊబిలో కూరుకు పోతున్నారు. పంటలకు వివిధ రకాల తెగుళ్లు సోకడంతో రైతులు అనేక రకాల మందులు పిచికారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ”బయో”ల దందా, నకిలీ పురుగు మందుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మామూళ్ల మత్తులో మునిగిపోయిన అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. కొందరు రైతులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం, ఫెర్టిలైజర్స్ ఓనర్స్ వద్ద మామూళ్లు పుచ్చుకుంటూ వారికే సపోర్ట్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు తెగుళ్ల గురించి రైతులకు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా పురుగు మందు షాపు యజమానులకు ఉపయోగపడేలా, వారి వద్ద ఉండే నకిలీ మందుల పేర్లని రైతులకు చెబుతు న్నారు. రైతులు ఫెర్టిలైజర్స్ షాపుల వద్దకు వెళ్లి, తెగుళ్ల గురించి చెప్పడంతో వారికి ఎక్కువ ఆదాయం వచ్చేలా నకిలీ ”బయో” మందులను ఇచ్చి పంపిస్తున్నారు. ఈ మందులు ఎన్నిసార్లు పిచికారీ చేసినప్పటికీ తెగులు మాత్రం అదుపులోకి రావడం లేదు. దీంతో రైతన్నలు లక్షలాది రూపాయలు నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎరువులు కూడా ఎమ్మార్పీ ధరలకు విక్రయిం చవలసి ఉండగా రూ.70 మేర అధికంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా బస్తా రూ.250కి అమ్మవలసి ఉండగా రూ.350కి విక్రయిస్తున్నారు. అలాగే డీఏపీ కూడా ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు. ఇలా ఎమ్మార్పీకి మించి ధరలకు అమ్ముతూ పెర్టిలైజర్స్ షాప్ యజమానులు లక్షలు దండుకుంటున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క రైతుకు కూడా దుకాణ యజమానులు రసీదులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ తతంగమంతా వ్యవసాయ శాఖ అధికారుల కనుస న్నల్లోనే జరుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాదు నుంచి నకిలీ బయో మందులు, నకిలీ క్రొక్లైన్ మందును తెచ్చి రైతులకు అమ్ముకొని, లక్షలు దండుకుంటున్నారు. బుధవారం మండలంలోని కలుజువలపాడు గ్రామానికి చెందిన కొండలు అనే రైతు మొక్కజొన్న పైరుకు మార్కాపురంలోని ఒక ఫెర్టిలైజర్ షాప్‌లో గులికల ప్యాకెట్ కొని తెచ్చి విప్పి చూడగా మొత్తం ఇసుకనే దర్శనమిచ్చింది. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులకు చెబితే ఇసుకతోనే గులికలు తయారు చేస్తారంటూ సమాధానం ఇచ్చారు. రైతులు దుకాణదారుల వద్దకి అప్పులకు వెళ్లడంతోనే, వారి ఇష్టం వచ్చిన మందులు ఇస్తున్నారని నేరుగా మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు అనడం గమనార్హం. ఇలా పశ్చిమ ప్రకాశంలో నకిలీ మందుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నకిలీ పురుగుమందుల విక్రయాలను అరికట్టాలని, ఎమ్మార్పీ ధరలకే ఎరువులు నమ్మేలా చర్యలు చేపట్టాలని, రైతులకు తప్పనిసరిగా రసీదు ఇచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు.