ప్రజాశక్తి – సింహాద్రిపురం నియోజవర్గంలో చీనీ సాగు కష్టతరంగా మారిందని రైతులు వాపోతున్నారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని చీనీ కాయలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి చీనీ కాయల సాగు చేసే రైతుల పరిస్థితి నేడు దయనీయంగా మారిపోయింది. మూడు సంవత్సరాల నుంచి చీనీ చెట్లు విపరీతమైన తెగులు కారణంగా ఎండిపోతున్నాయి. మరోవైపు వీటిని కాపాడుకోవడానికి విపరీతమైన పెట్టుబడి పెట్టి ఆమేరకు దిగుబడులు రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా నియోజవర్గంలోని సింహాద్రిపురం, తొండూరు, పులివెందుల, లింగాల, వేముల మండలాలలో దాదాపు 22 వేల ఎకరాల్లో చీనీ పంట సాగులో ఉంది.పెరగని చీని ధరలు ప్రస్తుత కోత దశలో ఉన్న చీనీ కాయలకు ధరలు ఏమాత్రం పెరగకపోవడంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో ధరలు టన్ను కాయలు రూ.40 నుంచి 50 వేలు వరకు పలికాయి. అలాంటిది ప్రస్తుతం టన్ను రూ 20 నుంచి రూ. 25 వేలు మాత్రమే ఉంది. దీనికి తోడు ఈ ఏడాది వాతావరణంలో మార్పులు కారణంగా కాయలు ఎక్కువ భాగం మంగు రావడంతో ధరలు మరింత తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.తెగులుతో ఎండిపోతున్నచెట్లు… మూడు సంవత్సరాల నుంచి చీనీ చెట్లకు విపరీతమైన తెగుళ్లు వ్యాపించడంతో వాటి నివారణ కొరకు వేల రూపాయల ఖర్చు పెట్టినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా వేరు కుళ్ళు, పులుసు పురుగు తెగులు కారణంగా చెట్లు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి. చీనీ కాయలకు నల్లి ఆశించడంతో కాయల ు(మంగు) నల్లగా మారిపోతున్నాయి.తోటలు తొలగింపు.. చీనీ సాగులో నష్టాలు వస్తుండడంతో రైతులు తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ముగ్గు చూపుతున్నారు. దశాబ్దకాల కిందట కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలంలో చీనీ సాగు ప్రధానంగా ఉండేది. సాగు భారం కావడంతో చాలామంది రైతులు వాటిని తొలగించి అరటి, మొక్కజొన్నతో పాటు ఇతర ప్రత్యాయ పంటల సాగుకు ఉపక్రమించారు. కొత్తగా చీనీ తోటల ఏర్పాటుకు రైతులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. గతంలో రైతులే చీని మొక్కల నర్సరీల సైతం ఏర్పాటు చేసి కర్ణాటక, తెలంగాణ ప్రాంతానికి విపరీతంగా సరఫరా చేసేవారు. ప్రస్తుతం నర్సరీలు సైతం కనుమరుగయ్యాయి. ప్రభుత్వం నుంచి ఆదరణ కరువు ప్రభుత్వం నుంచి చీనీ సాగుకు ఆదరణ కరువైందని రైతులు చెబుతున్నారు. గతంలో పాత తోటల పునరుద్ధరణ పథకం కింద రైతులకు ప్రోత్సాహం ఉండేది. ప్రస్తుతం వాటికి ప్రభుత్వం మంగళం పాడడంతో పాటు చీనీ చెట్లు చనిపోతున్న వాటికి ఇన్సూరెన్స్ రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.తీవ్రంగా నష్టపోతున్నాం.. ఆరుగాలం శ్రమించి పంట దిగుబడులు వచ్చే సమయంలో ధరలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రభుత్వమే కనీస మద్దతు ధరగా టన్ను చీనీ కాయలు రూ 40 వేలతో కొనుగోలు చేయాలి. ప్రస్తుతం కూలీలు, పురుగుమందులు, ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. కాయలకు మాత్రం ధరలు ఆ విధంగా పెరగకపోవడంతో నష్టపోతున్నాం.-వెంకట్రామిరెడ్డి, చీని రైతు, సింహాద్రిపురం.రాయితీతో ఎరువులు అందజేయాలి.. ప్రభుత్వం రాయితీతో పురుగుమందులు, ఎరువులు అందజేయాలి. ప్రస్తుతం చీని సాగు కష్టంగా మారింది. లెక్కకులేనన్నిసార్లు పురుగు మందులు పిచికారి చేసినప్పటికీ ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. నకిలీ పురుగుమందులు పిచికారి చేస్తున్నామా లేక వాతావరణంలో మార్పులు కారణంగా ఈ తెగులు వస్తున్నాయా అర్థం కావడం లేదు. దీని నివారణకు నాణ్యమైన పురుగుమందులను ప్రభుత్వమే రాయితీతో అందజేయాలి.- రవిశంకర్, చిని రైతు ,గురజాల.ధరలు తక్కువగా ఉన్న విషయం వాస్తవమే ప్రస్తుతం మార్కెట్లో చీని కాయల ధరలు తక్కువగా ఉన్న విషయం వాస్తవమే. మహారాష్ట్రలో దిగుబడి పెరగడంతో ధరలు పెరగనట్లు తెలుస్తుంది. తెగుళ్లపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మరిన్ని అవగాహన సదస్సులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటా.మల్లేశ్వర్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి, ముద్దనూరు.
