- మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాష
ప్రజాశక్తి – కడప (వైఎస్‌ఆర్ జిల్లా) : ఎంతో కష్టపడి సాధించిన ఎంబార్కేషన్ పాయింట్‌ను తీసేయడం బాధాకరమని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. ఇది కేవలం టిడిపి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే అన్నారు. మైనార్టీ వర్గాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ జిల్లాలోని తన నివాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం అంజాద్ బాషా మాట్లాడారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి విజయవాడ నుండి ఎంబార్కే
షన్ పాయింట్ తొలగించారని, గత వైసిపి ప్రభుత్వ హయంలో ఎంతో ప్రయాసలతో, కష్టపడి ఇక్కడ పాయింట్ సాధించామని చెప్పారు. టిడిపి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల విజయవాడలో పాయింట్ తొలగించారన్నారు. 2019 సంవత్సరం వరకూ హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హాజీలు యాత్రకు వెళ్లేవారని, అప్పట్లో మన రాష్ట్ర హజీలకు తెలంగాణ ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించలేదని అన్నారు. ఆ తర్వాత మాజీ సిఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో 2020లో మన రాష్ట్రంలోని విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కరోనా నేపథ్యంలో రెండేళ్లు హజ్ యాత్ర జరగలేదని, 2023లో విజయవాడ ఎంబర్కేేషన్ పాయింట్ నుంచి 1813 మంది హజ్ యాత్రకు వెళ్లారని తెలిపారు. అదనపు భారాన్ని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఉత్తర్వులు జారీచేసిందని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ హజ్ కమిటీ చైర్మన్ గౌసులాజం, మాజీ చైర్మన్ కరిముల్లా, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జాఫుల్లా, నాయకులు పాల్గొన్నారు.