రాష్ట్రంలో పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకురావాలి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Jan 10,2025 15:45 #CM Chandrababu, #naredco

గుంటూరు : నేడు గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షో ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లు అన్ని రంగాలను పతనావస్థకు తీసుకొచ్చారనీ ఆయన వైసిపి పై ఆరోపించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు  రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మర్చేశారని వైసిపి నేతలను ఆయన విమర్శించారు.  సభలో  సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. గత ప్రభుత్వంలో నిర్మాణ రంగం అధ్వానంగా మారింది. ప్రజలు మమ్మల్ని నమ్మి 93 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం కట్టబెట్టారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్ నిర్మాణం ప్రారంభించాం. ప్రధాని మోడీ విశాఖకు వచ్చి రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తోంది. 1995లో హైదరాబాద్‍లో ఏమీ లేని స్థితిలో అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఏపీలో నిర్మాణ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. ఉచిత ఇసుక విధానం తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చాం. నిర్మాణ రంగం నిరంతరం జరిగే ప్రక్రియ. నరెడ్కో, క్రెడాయ్ వంటి సంస్థలు కలిసి ముందుకు రావాలి. రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి ముందుంటాం. వైసీపీ పాలనలో అన్నింటికంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. మేం అధికారంలోకి రాగానే నిర్మాణ రంగానికి ప్రాధాన్యమిచ్చాం. ఎన్నడూ చూడనివిధంగా భూ సమస్యల దరఖాస్తులు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలే భూసమస్యలకు ముఖ్య కారణం. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వైసీపీ నిర్వాకంతో టీడీఆర్ బాండ్లు తీసుకుని నష్టపోయారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశాం. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేది మా లక్ష్యం’ అని  సీఎం చంద్రబాబు అన్నారు.

➡️