బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

ప్రజాశక్తి-రాయచోటి/రాయచోటి టౌన్‌/చిన్నమండెం/రామాపురం బాల్యవివాహాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఫయాజ్‌ ఫంక్షన్‌ హాల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో కిషోర్‌ వికాసం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని బాల్యవివాహాలు జరిగితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగినట్లయితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిని సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు బాల్య వివాహాల నిర్మూలనకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1098కు ఫోన్‌ చేసి సహకరించాలన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు మగవారికి ఏమాత్రం తీసుకోకుండా అన్ని రంగాలలో ముందున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలు మరింత పైకి ఎదిగేందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరణ : ప్రజా దర్బార్‌ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. రాయచోటి పట్టణంలోని తమ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారిని నేడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి: ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. చిన్నమండెం మండలం, దేవగుడిపల్లె కెజిబివి పాఠశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గహాలలో ఉండే విద్యార్థులను ఉపాధ్యాయులు, వార్డెన్లు తమ కన్నబిడ్డల చూసుకోవాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంటగదులు, మరుగుదొడ్లు, పాఠశాల తరగతి గదులు, పాఠశాల పరిసర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వ మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులకు నాసిరకం భోజనం అందిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు కెజిబివి పాఠశాలలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి మంత్రి నూతన బోరును ప్రారంభించారు. యువత రాష్ట్రానికి మంచి పేరుతేవాలి : యువత దేశానికి శక్తిలాంటివారని, అన్ని రంగాలలో ముందుండి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. రామాపురం మండల పరిధిలోని బిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో అన్నమయ్య జిల్లా యువజనోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఒక కల ఉంటుందని వారి కలను నిరూపించుకోవడానికి ఇలాంటి యువజన ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జిల్లాలో యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని యువత మంచి మార్గాన్ని ఎంచుకొని సమాజానికి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమాజంలో ప్రమాదాలు జరుగుతూ కొన్ని సమయాలలో రక్తం దొరకక కొంతమంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటి వారందరికీ యువత రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారైనా రక్తదానం చేయాలన్నారు. కార్యక్రమంలో స్టెప్‌ సిఇఒ సాయి గ్రేస్‌, బిట్స్‌ కళాశాల కరస్పాండెంట్‌ భాస్కర్‌, ప్రిన్సిపల్‌ సిఎస్‌ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు : విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడతామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. రామాపురం మండల పరిధిలోని బిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వీరారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీను, కడప జిల్లా విభిన్న ప్రతిభావంతుల ఉపాధ్యక్షుడు బి.దామోదర్‌రెడ్డి తమ సమస్యల పరిష్కారానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సమస్యలన్నీ ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కషి చేస్తుందని మంత్రి వారికి తెలిపారు.

➡️