బాల్య వివాహాలు, బాలకార్మికులు తగ్గాలి

Mar 19,2025 21:26

ప్రజాశక్తి-విజయనగరం :  మిషన్‌ వాత్సల్య కార్యక్రమం కింద బాలల సంక్షేమం, పరిరక్షణ కోసం గ్రామ స్థాయిలో సర్పంచ్‌ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి 15 రోజులకు ఒక సారి సమావేశం నిర్వహించాలని సంయుక్త కలెక్టర్‌ సేతు మాధవన్‌ తెలిపారు. బుధవారం జిల్లా స్థాయి బాలల పరిరక్షణ కమిటీ జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి కమిటీలో మహిళా పోలీస్‌ కన్వీనర్‌ గా ఉంటారని, పంచాయతీ సభ్యులు, ఉపాధ్యాయులు, ఎన్‌.జి.ఓ లు, ఆరోగ్య వర్కర్స్‌ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. గ్రామ స్థాయి సమావేశాల్లో అనాధ పిల్లల్ని, స్కూల్‌ డ్రాప్‌ ఔట్స్‌ ను, గుర్తించాలన్నారు. బాల్య వివాహాలు, ట్రాఫికింగ్‌, డ్రగ్స్‌, దోపిడీ తదితర అంశాల పై చర్చించాలని అన్నారు. బాలల హక్కుల సంరక్షణ పై అవగాహనా సదస్సులు నిర్వహించాలని, నైపుణ్య శిక్షణలు, కెరీర్‌ కౌన్సిలింగ్‌ తదితర కార్యక్రమాలను నిర్వహించి పునరావాసం కల్పించాలని తెలిపారు. గ్రామ స్థాయి లో నిర్వహించిన కమిటీలో చర్చించిన అంశాలను జిల్లా స్థాయి కమిటీ కి పంపించాలని ఆదేశించారు. గ్రామ స్థాయి లో పరిష్కారం లభించని వాటికీ జిల్లా స్థాయి లో చర్చించి తగు పరిష్కారం చూపిస్తామన్నారు. జిల్లా స్థాయి లో ప్రతి నెల కమిటీ సమావేశం జరుగుతుందని, అదే విధంగా మండల స్థాయి, మున్సిపల్‌ స్థాయి సమావేశాలలో కూడా బాలల హక్కుల పై చర్చ జరగాలని అన్నారు డ్రాప్‌ ఔట్‌ అయిన బాలికలను గుర్తించి డ్రాప్‌ ఔట్‌ కు గలా కారణాలను విశ్లేషించాలని డిఇఒకు తెలిపారు. కర్మాగారాలు, హోటళ్లలో పనిచేసే బాలికలను గుర్తించాలని లేబర్‌ కమిషనర్‌కు సూచించారు. సమావేశంలో ఐసిడిఎస్‌ ఇంఛార్జి పీడీ ప్రసన్న, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ జీవనరాణి, మున్సిపల్‌ కమిషనర్‌ నల్లనయ్య, జెడ్‌పి సిఇఒ సత్యనారాయణ, డిసిపిఒ లక్ష్మి, డిఎస్‌పి, తదితరులు పాల్గొన్నారు.

➡️