ప్రజాశక్తి-విజయనగరం కోట : పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఎస్‌పి వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై, పోలీసు వెల్ఫేర్ పాఠశాలలో అదనంగా నిర్మించిన రెండు తరగతి గదులను ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ నెహ్రూ మంచి విద్యావేత్తగా, ఆర్ధికవేత్తగా, ప్రధానిగా భారత దేశానికి విశేషమైన సేవలందించారన్నారు. పోలీసు సంక్షేమ పాఠశాలలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులను నిర్మించామని, పాఠశాలను మరింత అభివద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్‌పి జి.నాగేశ్వరరావు, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్ : స్థానిక గురజాడ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా డిపిఅర్‌ఒ ఎస్. జానకమ్మ హారయ్యారు. విద్యార్థుల వివిధ రకాల వేష ధారణలు ఆకట్టుకున్నాయి. 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు పిల్లలకు వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు జానకమ్మ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పాఠశాల హెచ్‌ఎం పూడి శేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.