తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు: కలెక్టర్‌

Apr 1,2024 22:07
తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు: కలెక్టర్‌

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.షన్మోహన్‌ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ ఎన్నికల ఏర్పాట్లు, సామాజిక పెన్షన్ల పంపిణీ, వేసవిలో తాగునీటి సరఫరాపై జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులుతో కలిసి జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్వోలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలతో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రానున్న సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం సూచనల మేరకు పోలింగ్‌ బూత్‌లలో మౌలిక సదుపాయాలు, ర్యాంప్‌లను పూర్తి చేయడం జరిగిందన్నారు. అలాగే మౌలిక వసతుల ఏర్పాట్లను మరొకసారి సరిచూసుకోవాలని తెలిపారు. తహసిల్దార్లు, ఎంపీడీవోలు వారంలోపు వారి పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి నివేదికలు సమర్పించాలన్నారు. పోలింగ్‌ కేంద్రం సంఖ్యను సూచించే విధంగా ఎన్నికల కమిషన్‌ సూచించిన మేరకు రంగులు ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్‌ సమయంలో సామాజిక పెన్షన్ల పంపిణీ గ్రామ/వార్డు సచివాలయాలలో సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయాలని, పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను వినియోగించరాదని తెలిపారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి నగదును బ్యాంక్‌ నుంచి తీసుకురావడం, లబ్ధిదారులకు పంపిణీకి తహశీల్దార్లు, ఎంపిడిఓలు, మున్సిపల్‌ కమిషనర్లు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ద్వారా వాలంటీర్లకు పంపిణీ చేయబడ్డ సిమ్‌ కార్డులు, ఐరిష్‌ లేదా బయోమెట్రిక్‌ డివైస్‌, సెల్‌ ఫోన్‌లను ఎంపీడీఓ లు స్వాధీనపరచుకుని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కి అందజేయాలన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో నీటి ఎద్దడి ఉందని, ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఎంపీడీఓలు, తహశీల్దార్లు ప్రణాళిక రూపొందించు కోవాలన్నారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలలో అవసమైతే ప్రైవేట్‌ బోర్లను వినియోగించుకోవాలని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రిటర్నింగ్‌ అధికారి అనుమతితో ఎన్నికల నిబంధనలను పాటిస్తూ ట్యాంకర్లను అనుమతించాలని అన్నారు. జిల్లాలో ప్రధానంగా పలమనేరు, పుంగనూరు, కుప్పం ప్రాంతాలలో నీటిఎద్దడి ఉందని ఎక్కడైనా అటువంటి సమస్యను గుర్తించి తహశీల్దార్లు, ఎంపీడీవోలు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో చిత్తూరు నుంచి డిఆర్డిఎ పిడి తులసి, డ్వామా పిడి రాజశేఖర్‌, డిపిఓ లక్ష్మి, మెప్మా పీడి రాధమ్మ, డిఎల్‌డిఓలు రవికుమార్‌, గౌరీ, ఎస్‌ఈ ఏపీట్రాన్స్కో శ్రీహరి పాల్గొన్నారు.’తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు’ వేసవి దృష్ట్యా నగరంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ చెప్పారు. నగరపాలక పరిధిలోని 50 వార్డుల్లో 39 వార్డులకు కల్వకుంట జలాశయం నుంచి నీరు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. జలాశయంలో ప్రస్తుతం 2,100 ఎంఎల్డీల నీరు ఉందని.. మరో మూడు నెలల వరకు నీటి సరఫరాకు ఇబ్బంది ఉండదని తెలిపారు. మిగిలిన 11 వార్డులో బోర్లు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోందన్నారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో అదనంగా ట్రిప్పుల్లో నీటి సరఫరా చేస్తామన్నారు. నగరంలో మొత్తం 463 బోర్లకు గాను 457 బోర్లు ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్నాయని, మరో ఏడు బోర్లు మరమ్మతులు చేస్తున్నట్లు వివరించారు. తాగునీటి సమస్యపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. తాగునీటి సమస్య ఉత్పన్నమైతే 9849907885కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్‌ చెప్పారు.

➡️