రెండు పోలియో చుక్కలతో బంగారు జీవితం: మేయర్ ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్ : పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయిస్తే పోలియో బారిన పడకుండా బంగారు జీవితం వుంటుందని చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్ ఆముదా పేర్కొన్నారు. ఆదివారం ఉదయం టెలిఫోన్ కాలనీ అర్బన్ హెల్త్ క్లినిక్‌లో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, 31వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్, జిల్లా పల్స్ పోలియో నోడల్ ఆఫీసర్ డాక్టర్ దేవదాసు, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ ఓ ప్రభావతి దేవిలతో కలసి ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియోను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు రెండు పోలియో చుక్కలు వేయడం వల్ల పిల్లలకు బంగారు జీవితం అందించిన వారమవు తామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇటీవల జగనన్న సురక్షా క్యాంపులు నిర్వహించి ప్రతి వార్డు సచివాలయ పరిధిలో హెల్త్ క్యాంపు నిర్వహించి అందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు అవసరమైన వారికి మందులు ఇచ్చారన్నారు. పాఠశాలల్లో జగనన్న కంటి వెలుగు ద్వారా పిల్లలందరికీ కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి కంటి అద్దాలు ఇచ్చారని తెలిపారు. డియం అండ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో 5 సంవత్సరాల లోపు 2,09,971 మంది పిల్లలు ఉన్నా రని, అందరికి వంద శాతం వేస్తామని తెలిపారు. జిల్లాకు 2,79,400 పోలియో డోసులు వచ్చాయని, 32 మండలాల్లోని 612 గ్రామ పంచాయతీలు, 503 గ్రామ సచివాలయాల్లో, 109 వార్డు సచివాలయాల పరిధిలో 1,415 పోలియో కేంద్రాలు ఏర్పాటు చశామని తెలిపారు. 5,660 మంది వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశామని, ప్రతి పోలియో కేంద్రంలో నలుగురు సిబ్బంది ఉంటారని, వీరు సుమారు 250 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని పేర్కొన్నారు. జన సంచారం ఎక్కవగా ఉండే ప్రాంతంలో, ఆర్టీసీ బస్టాండ్ లోను, రైల్వే స్టేషన్స్ లోను, మురికివాడలోను ఇటుక బట్టీల వద్ద పనిచేసే చోట్ల పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అనివార్య కారణాల వల్ల ఆదివారం పోలియో చుక్కలు వేసుకోని పిల్లలకు సోమవారం, మంగళవారం, రెండు రోజులు 4,83,028 గహాలకు సంబంధించి ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు 142 రూట్లు ,64 మొబైల్ వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. రెండు పోలియో చుక్కలు వేయడం వల్ల జీవితంలో పిల్లలు పోలియో బారిన పడ కుండా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ కార్పొరేటర్ సైయాద్, డిఐఓ డాక్టర్ రవిరాజు, డిప్యూటీ డి యం అండ్‌హెచ్ ఓ వెంకటప్రసాద్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకేష్, డాక్టర్ శిరీష, వైద్య, వార్డు సచివాలయ సిబ్బంది వాలంటర్లు పాల్గొన్నారు.
