108 ఉద్యోగుల నూతన కమిటీ ఏకగ్రీవంప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ స్థానిక రెవెన్యూ భవన్‌లో శనివారం 108 ఉద్యోగుల సర్వసభ్య సమావేవశం జిల్లా అధ్యక్షులు శివకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బల్లి కిరణ్ కుమార్ మాట్లాడుతూ 108 ఉద్యోగులకు 12 గంటల పని దినాన్ని ఎనిమిది గంటలకు కుదించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వాల సైతం.. 108 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయడం హర్షణీయమని ఇందులో భాగంగానే 108 ఉద్యోగులకు సముచిత స్థానం కల్పించే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక జీవోను తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ జీవో ద్వారా 108లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తులకు ఇతర శాఖల్లో కూడా ఉద్యోగావకాశాలు పొందేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం 108 ఉద్యోగుల కాంట్రాక్ట్‌ను రద్దు చేయడంతో పాటు కొత్త కాంట్రాక్ట్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును చేపట్టిందని అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కొలువులో భాగంగా ఖాళీలను భర్తీ చేసే సమయంలో 108 ఉద్యోగుల అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకునేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం 108 ఉద్యోగుల సంఘం నూతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఎన్నికలను నిర్వహించి అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా కోశాధికారి రసూల్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యోగేష్‌లు ఎన్నికయ్యారు.
