దూసుకొస్తున్న తుపాన్

Nov 26,2024 22:34
దూసుకొస్తున్న తుపాన్

శ్రీ జిల్లాలో ముసురు వానలుశ్రీ అప్రమత్తమైన అధికారులుశ్రీ పెరిగిన చలితో ప్రజల అవస్థలుప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: తుపాన్‌… తుపాన్‌… ఈనెల మొదటివారంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారి రాష్ట్రంపై ప్రభావం చూపనున్నదని హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయినప్పటికీ అది జిల్లాపై పెద్దగా ప్రభావం లేకుండాపోయింది. అయితే తాజా తుపాన్‌ హెచ్చరికలతో మూడు రోజులపాటు జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుతో ఆకాశం మేఘావతమై ముసురు కమ్ముకుంది. జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో సీజనల్‌ వ్యాధులైన డెంగీ, మలేరియా, కలరా వ్యాపించే అవకాశాలున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంటూ ప్రజాఆరోగ్యంపై దష్టి సారించాలి. అలాగే వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయ ఉద్యానశాఖ, జల వనరులశాఖ అప్రమత్తంగా ఉంటూ చెరువులు, ప్రాజెక్టులు రిజర్వాయర్ల సంరక్షణతో పాటు పంట నష్టం ఆస్తి నష్టం చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. నగరపాలికా పురపాలిక సంస్థలు పారిశుద్ధ్యం కోసం మెరుగైన చర్యలు చేపట్టాలి. బంగాళాఖాతంలోని వాయుగుండం తుపాన్‌గా మారి బుధవారం సాయంత్రం నుంచి జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ప్రస్తుతం శ్రీలంక తీరం దగ్గరలో ఉన్న ఫెంగల్‌ తుపాన్‌ అత్యంత వేగంగా భారతదేశం వైపు దూసుకొస్తుంది. ఈ తుపాన్‌ తమిళనాడు రాష్ట్రంలో ఈనెల 29వ తేదీన తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రానికి రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. తుపాన్‌ ఫెంగల్‌ ప్రభావంతో ఈనెల 30వ తేదీ వరకు తమిళనాడులో భారీ వర్షాలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలు అయిన నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి వానలు పడనున్నాయి. రైతులు అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కోతలు ఉంటే వెంటనే పనులు చేసుకోవాలని, కల్లాల్లోని పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తుపాన్‌ 29న తీరం దాటనున్న నేపథ్యంలో రాష్ట్రాల్లోని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంట 50 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముసురు వానతో పెరిగిన చలిఇబ్బంది పడ్డ వద్ధులు, పిల్లలు.సోమల: తుపాను ప్రభావం కారణంగా మండలంలో మంగళవారం ఉదయం నుంచి అప్పుడప్పుడు ముసురు వానతోపాటు ఈదురు గాలులకు చలి తీవ్రత పెరిగింది. దీంతో వద్ధులు పిల్లలు ఇబ్బంది పడ్డారు. తుపాను ప్రభావం కారణంగా ఉదయం నుండి ఎండ లేకుండా వర్షం పడుతూ చలిగాలులు వీస్తూ వచ్చాయి. రోజంతా ఓ మోస్తారు వర్షం కురుస్తూ ఉండడంతో రోజువారీ కూలి పనులకు వెళ్లేవారు కూడా పనులేక ఇంటి వద్ద ఉండాల్సి వచ్చింది. మండలంలో ఇంతవరకు ఏ చెరువు నీటితో నిండుగా లేవు. భారీ వర్షం కురిసి అన్ని చెరువుల్లోకి నీరు రావాలని తద్వారా చెరువు ఆయకట్టు రైతులు తమ పొలాలలో పంటలు పండించేందుకు అవకాశం ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు.అప్రమత్తంగా ఉండండి: తహశీల్దార్‌ పార్వతి వి కోట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోవు మూడు రోజులలో భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికల మేరకు మండల పరిధిలోని రెవెన్యూ సిబ్బంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్‌ పార్వతి విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్‌ వారు ఆదేశాలు జారీ చేశారని, ఈ మేరకు తహశీల్దార్‌ పార్వతి రెవెన్యూ అధికారులను, సిబ్బందిని గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, పాడి పరిశ్రమ రైతులు, పశువులకు అవసరమైన పశుగ్రాసాన్ని ముందస్తుగా సమకూర్చుకోవాలని సూచించారు. తుపాన్‌ కారణంగా ఏదైనా నష్టం వాటిల్లితే కార్యాలయానికి తక్షణం సమాచారం అందించాలని కోరారు.

➡️