జిల్లాలో అంతర్జాతీయ బృందం పర్యటన

Nov 29,2024 20:47 #chittore
  • ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై క్షేత్రస్థాయి పరిశీలన

ప్రజాశక్తి- కుప్పం రూరల్‌ (చిత్తూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్‌లో ఆగ్రో ఎకాలజీ, వాతావరణ, ఆహారం, ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారని అంతర్జాతీయ వ్యవసాయ ప్రతినిధులు ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై 20 దేశాలకు చెందిన 51మంది అంతర్జాతీయ ప్రతినిధులు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించి వేర్వేరు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగ్రో ఎకాలజీలో జరుగుతున్న నూతన పరిజ్ఞానాన్ని పరిశీలించే క్రమంలో వాతావరణంలో వస్తోన్న మార్పులు, ఆహార భద్రత, ఆరోగ్యం తదితర అనేక సవాళ్లకు సమాధానంగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం అమలు చేయడం ప్రశంసనీయమని అంతర్జాతీయ ప్రతినిధుల బృందం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజాభాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం రూపొందించిన సార్వత్రిక సూత్రాలు ప్రపంచంలో మరెక్కడా చూడలేదని, అనేక సవాళ్లను అధిగమించేలా ఈ సూత్రాలు ఉన్నాయని, ఈ సూత్రాలు ప్రపంచానికి ఎంతో అవసరమని అంతర్జాతీయ ప్రతినిధులు తెలిపారు. పనామా, బ్రెజిల్‌, గాంబియా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, నెదర్లాండ్స్‌ తదితర దేశాల నుంచి ఆగ్రో ఎకాలజీ నిపుణులు, పరిశోధకులు, రైతు నాయకులు, వ్యవసాయ నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. కుప్పం మండలంలోని సీగలపల్లి, అంకిరెడ్డిపల్లి, సింగా సముద్రం, జీడిమాకులపల్లి గ్రామాలలో వేర్వేరు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఈ బృందం సభ్యులు సందర్శించారు. ఎపిఎస్‌ఆర్‌టిసి వైస్‌ చైర్మన్‌ పిఎస్‌ మునిరత్నం, ఎపిసిఎన్‌ఎఫ్‌ రీజనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ చక్రాల చంద్రశేఖర్‌ మునిరత్నం, జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్‌ మురళీకృష్ణ, జిల్లా మేనేజర్‌ వాసు, రైతు సాధికార సంస్థ అధికారులు రాము, భాగ్యలక్ష్మి, సురేష్‌, జిల్లా స్థాయి మేనేజ్మెంట్‌ ప్రొఫెషనల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️