పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలుప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: ఉపవిద్యాశాఖ అధికారులు నియామకం కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈనెల 25న పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత శాఖలు సమన్వయంతో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని డిఆర్‌ఓ బి.పుల్లయ్య అన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి శుక్రవారం వివిధ శాఖల అధికారులతో డిఆర్‌ఓ తన ఛాంబర్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల కోసం ఈనెల 25న జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాలలో ఆబ్జెక్టివ్‌ టైప్‌ పరీక్షలను నిర్వహించనున్నారని, ఈ పరీక్షలకు 730 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. చిత్తూరులోని సీతమ్స్‌ కళాశాలలో 150 మంది, పూతలపట్టులోని వేము ఇంజనీరింగ్‌ కళాశాలలో 330 మంది, పలమనేరులోని మదర్‌ తెరిసా ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో 250మంది అభ్యర్థులు కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ రాయినున్నారని అన్నారు. పరీక్షా సమయం ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఉదయం 7 నుంచి 8.30 గంటల మధ్య మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని, క్షణం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని అన్నారు. పరీక్ష రాసే వారిలో దివ్యాంగులు ఉన్నట్లయితే తనకంటే తక్కువ విద్యార్హత ఉన్న వారిని సహాకులుగా తమ వెంట తీసుకురావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల రవాణా సదుపాయం కోసం ఆర్టీసీ వారు తగు ఏర్పాట్లు చేయాలని, అబ్జెక్టివ్‌ తరహాలో కంప్యూటర్ల మీద పరీక్ష ఉన్నందున నిరంతర విద్యుత్‌ ఇవ్వాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్యశాఖ వారు ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేసుకోవాలని, పోలీస్‌శాఖ వారు తగిన బందోబస్తు నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలలోకి మొబైలు ఫోన్‌లు, డిజిటల్‌ వాచ్‌లు వంటి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించరని, హాల్‌ టికెట్‌, గుర్తింపు కార్డు, వాటర్‌ బాటిల్‌ను మాత్రమే అనుమతిస్తారన్నారు. అభ్యర్థుల మొబైలు ఫోన్‌లను డిపాజిట్‌ చేసుకోవడానికి పరీక్షా కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేయాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉండేలా రెవెన్యూ, పోలీస్‌ అధికారులు చూడాలన్నారు. ఆర్టీసీ అధికారి కేశవమూర్తి, ట్రాన్స్కో అధికారి కేశవులు, డాక్టర్‌ శిరీష, సిఐ కులాయప్ప, ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌ రెడ్డి, సి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ గుణశేఖర్‌ రెడ్డి, సెక్షన్‌ ఆఫీసర్‌ అంజనా తదితరులు పాల్గొన్నారు.

➡️