‘శాడిస్ట్‌ చంద్రబాబు’తో యుద్ధానికి ‘సిద్ధమా’..!

Apr 3,2024 22:32
'శాడిస్ట్‌ చంద్రబాబు'తో యుద్ధానికి 'సిద్ధమా'..!

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, పూతలపట్టు, సదుం ‘చంద్రబాబు ఎంతగా దిగజారిపోయాడంటే ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చే లోపే సెలవు దినమైనా అవ్వతాతల మొహంలో చిరునవ్వులు చూస్తూ వాళ్ల చేతిలో పింఛన్‌ పెట్టే వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర పన్నాడు.. చంద్రబాబు మనిషి నిమ్మగడ్డ ఇచ్చిన ఫిర్యాదు వల్లే వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేసిన పరిస్థితి కల్పించారు.. అవ్వతాతలు పింఛన్‌ అందుకునేందుకు నడవలేక పడుతున్న అగచాట్లు చూసినపుడు ఈ చంద్రబాబు మనిషా, శాడిష్టా’ అనిపిస్తోంది అని సిఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఇలాంటి వ్యక్తికి మనం ఓటు వేయడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి వెళ్లి మళ్లీ జగనన్ననే తెచ్చుకుందామని స్టార్‌ క్యాంపెయిన్‌ చేయాలని పిలుపునిచ్చారు. ‘మేమంతా సిద్ధం’ ఏడో రోజు సభ బుధవారం సదుం, పూతలపట్టు మండలాల్లో కొనసాగింది. సదుం మండలం గొడ్లవారిపల్లి బస్టాప్‌ సమీపంలో పింఛన్‌దారులను ఉద్దేశించి ప్రసంగించారు. కల్లూరు శివారులో కురబల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో 20 క్రేన్లతో భారీ గజమాల ఏర్పాటు చేసి సిఎంకు స్వాగతం పలికారు. సదుంలో పలువురు వైసిపిలో చేరిక సిఎం బస చేసిన అమ్మగారిపల్లి వద్ద పెద్దఎత్తున టిడిపి నాయకులు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. కుప్పం ఎంఎల్‌సి భరత్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఎం.సుబ్రమణ్యంరెడ్డి, కృష్ణమూర్తి, బేతప్పలు వైసిపి కండువా కప్పుకున్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో టిడిపికిచెందిన ఎ.హరిక్రిష్ణ సిఎం జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సిఎం యాత్ర ప్రారంభం కాగానే పలమనేరుకు చెందిన పట్టు రైతులు సిఎంను కలవడానికి ఇబ్బందులు పడ్డారు. సెక్యూరిటీ వారిని అడ్డుకోవడం కనిపించింది. కల్లూరు మీదుగా బస్సు యాత్ర కొనసాగింది. దారి పొడవునా డ్వాక్రా సంఘాల మహిళలు సిఎం జగన్‌కు స్వాగతం పలికారు. పూతలపట్టు బైపాస్‌లో నిర్వహించిన బహిరంగసభలో సిఎం జగన్‌ మాట్లాడుతూ సభ మహాజన సముద్రాన్ని తలపిస్తోందన్నారు. ఇంటింటికి మేలు చేసిన సత్యనిష్టత మన ప్రభుత్వం ఓ వైపు ఉందని, మరోవైపు గతంలో మూడుసార్లు అధికారంలో ఉండి అబద్దం, మోసం, చెడు, చీకటిని రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన బృందం మన కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. ప్రజలకు మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజల పక్షాన ఉన్న జగన్‌కు మధ్య యుద్ధమన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి తోడుగా ఉండటం ద్వారా పేదలు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, అవ్వతాతలు, బడుగులు, బలహీనులు, మైనార్టీల తరపున నిలబడి, వీరిని రక్షించేందుకు మీరంతా సిద్ధమేనా అని అన్నారు. 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపి సీట్లు గెలిపించుకుని పేదలకు తోడుగా ఉండి డబుల్‌ సెంచరీ సర్కార్‌ స్థాపించాలన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మీకు మీ ఇంటికి ఏం చేశాడో ఆలోచించాలన్నారు. ఒక్క రూపాయి అయినా మీ అకౌంట్‌లో పడిందా గుర్తు చేసుకోవాలన్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు చూస్తే మన ప్రభుత్వం గుర్తుకొస్తుందన్నారు. ప్రభుత్వ బడిని నాడునేడులా రూపురేఖలు మార్చేశామన్నారు. ఆరోగ్యశ్రీని రూ.25 లోల వరకూ ప్రతి పేదవానికి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కి, నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లోకి వెళ్లిపోవడం అంటే మధ్యలో దళారీ వ్యవస్థ లేదన్నారు. 130 సార్లు బటన్‌ నొక్కి సంక్షేమ పథకాలను అందించామన్నారు. 2014లో ఇదే కూటమి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, మోడీ ఫొటోలతో ముఖ్యమైన హామీలంటూ ప్రతి ఇంటికి పంపించాడని, రైతుల రుణమాఫిపై సంతకం చేస్తానన్నాడని, పొదుపు సంఘాలకు రుణమాఫీ చేస్తామని చెప్పాడని, ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.25వేలు బ్యాంకులో డిపాజిట్‌చేస్తానని చెప్పాడని, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడని, సింగపూర్‌కు మించి చేస్తానన్నాడని, ఏ ఒక్కటైనా చేశాడా అని ప్రశ్నించారు. సూపర్‌ సిక్స్‌ అంటూ మరోసారి మోసం చేసేందుకు ఆ ముగ్గురూ మరోసారి ముందుకొస్తున్నారని, నమ్మవచ్చా? అని ప్రశ్నించారు. కేసును రీ ఓపెన్‌ చేస్తానని సిఎం హామీ రొంపిచెర్ల : తన బిడ్డ నారాయణ కళాశాల యాజమాన్యం న ఇర్లక్ష్యం వల్ల మృతిచెందాడని, తనకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు సిఎం జగన్మోహన్‌రెడ్డిని సదుం మండలం అమ్మవారిపల్లిలో కలిసి వినతిపత్రం అందజేశారు. రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లి గ్రామ పంచాయతీ ఫజుల్‌పేటకు చెందిన అబ్దుల్‌ నబీ, షాహీరాల రెండో కుమారుడు అబ్దుల్‌ నజీర్‌ (17) తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం సమీపంలోని నారాయణ కాలేజీలో ఇంటర్‌ చదువుతూ 2021, ఫిబ్రవరి 21న వాలీబాల్‌ ఆడుతూ కళ్లు తిరిగి పడిపోయాడని, కళాశాల యాజమాన్యం ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల వల్ల మృతిచెందాడని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసు రీ ఓపెన్‌ చేయిస్తానని సిఎం జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీనివాస మంగాపురం నారాయణ కాలేజీకి ప్రభుత్వ అనుమతి లేదన్నారు. సిఎం జగన్‌ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. బంగారుపాళ్యం: మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, థామస్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసిపి కండువా కప్పుకుని పార్టీలోకి చేరారు.

➡️