వివాదాల బస్టాండ్‌..

వివాదాల బస్టాండ్‌..

వివాదాల బస్టాండ్‌..ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: జిల్లా కేంద్రమైన చిత్తూరులో వివాదాలకు కేరాఫ్‌గా కాసు బ్రహ్మానందరెడ్డి పాత బస్టాండు మారింది.. అభివద్ధి పేరిట హైరోడ్డు విస్తరణ పేరుతో కాసు బ్రహ్మానందరెడ్డి పాత బస్టాండు మూసి మూసివేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అభివద్ధి ప్రధానంగా చిత్తూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని పదేపదే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌, కూటమి నాయకులు స్పష్టం చేస్తూ కట్టమంచి నుండి రెడ్డిగుంట వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టారు. ముందుగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపు ప్రభుత్వ భవన ప్రహరీ గోడలను జెసిబిల ద్వారా కూల్చివేస్తున్నారు. మొదట్లో రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్న భవన యజమానులు ఎమ్మెల్యే సర్ది చెప్పడంతో కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హైరోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలోనే చిత్తూరు పాత బస్టాండు అంశం గత వారం రోజులుగా చిత్తూరులో హాట్‌ టాపిక్‌గా మారింది. మూడు ఎకరాలకు పైగా ఉన్న పాత బస్టాండు ఆవరణంలో కమర్షియల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడతామంటూ నగరపాలక సంస్థ కూటమి నేతలు చెబుతున్నారు. ఈ మేరకు వారం రోజుల క్రితం పాత బస్టాండ్‌ లోనికి బస్సులు రానివ్వకుండా చుట్టూ రేకులతో ప్రహరీ గోడ ఏర్పాటు చేశారు. పాత బస్టాండ్‌లోని కూరగాయల చిరువ్యాపారుల దుకాణాలను తొలగించి రైతు బజారుకు మార్చారు. పాత బస్టాండ్‌లో తాత్కాలికంగా షెడ్యూల్‌ ఏర్పాటు చేసుకున్న షికారులను వెంటనే ఖాళీ చేయాలంటూ మున్సిపల్‌ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చిన్నపాటి నిర్మాణాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఖాళీ చేయాలంటూ నగరపాలక సంస్థ నోటీసులు అందజేయడంతో ‘దశాబ్దాల కాలం నుంచి ఇక్కడే వ్యాపారాలు నిర్వహించుకుంటున్నాం.. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి పాత బస్టాండులో షాపులు నిర్మించుకున్నామంటూ’ పాత బస్టాండ్‌ షాప్‌ యజమానుల సంఘం పాత బస్టాండ్‌ మూసివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1946లో నగరపాలక సంస్థకు డబ్బులు చెల్లించి షాపులు ఏర్పాటు చేసుకున్నామని ఉన్నట్టుండి ఖాళీ చేయాలంటే ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నారు. పాత బస్టాండు మూసివేత అధికార ప్రతిపక్షాల మధ్య అగ్గిరాజేస్తోంది. ప్రతిపక్ష వైసిపి పాత బస్టాండ్‌లోని సమావేశం నిర్వహించి చిరు వ్యాపారులకు అండగా ఉంటామంటూ అభివద్ధి పేరిట చిరు వ్యాపారుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తే దశలవారి పోరాటాలకు పూనుకుంటామంటూ వైసిపి నేతలు హెచ్చరించారు. ఏది ఏమైనాప్పటికీ పాత బస్టాండ్‌ నమ్ముకొని 20 షికారిల కుటుంబాలు, 50కి పైగా చిరువ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. వీరికి ప్రత్యామ్నాయం చూపడంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని వ్యాపారులు కోరుతున్నారు.

➡️