ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: బొమ్మసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణాన్ని క్రీడా స్థలాన్ని శుభ్రం చేసి చెట్లను నాటే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ హరిచంద్ర శేఖర్ మాట్లాడుతూ కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరూ కషి చేస్తూ ప్రతి మంచి సందర్భంలో ఒక చెట్టును నాటడం ద్వారా సమాజ హితం కోసం, మంచి ఆరోగ్యం కోసం కషి చేయాలని కోరారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం రెడ్డి 50 చెట్లను కళాశాలలో నాటడానికి సంకల్పించి ఈ కార్యక్రమానికి నిర్వహించినట్లు తెలిపారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీహర్ష మాట్లాడుతూ చెట్లను సంరక్షించుకునే బాధ్యతను ప్రతి ఒక్కరూ స్వచ్చంధంగా తీసుకోవాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బత్తయ్య, రెడ్డప్ప, జ్యోతి, సెల్వి, ప్రసన్న పాల్గొన్నారు.