టెంపుల్‌ కన్వెన్షన్‌తో సనాతన ధర్మ పరిరక్షణ’ఐటిసిఎక్స్‌ -2025’లో సిఎంలు

టెంపుల్‌ కన్వెన్షన్‌తో సనాతన ధర్మ పరిరక్షణ’ఐటిసిఎక్స్‌ -2025’లో సిఎంలుప్రజాశక్తి – తిరుపతి (మంగళం) టెంపుల్‌ కన్వెన్షన్‌తో సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని వక్తలు ఉద్ఘాటించారు. దేవాలయాల అభివద్ధి కోసం ప్రజల నుండి ఐవిఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా అభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. తదనుగుణంగా మంచి సలహాలతో ఆలయాల నిర్వహణ మరింత పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించడానికి కార్యచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. ఇంటర్నేషనల్‌ టెంపుల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో -2025ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం కరకంబాడి మార్గంలోని ఆశా కన్వెన్షన్‌ సెంటర్‌లో జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ ఎక్స్‌ పో ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సనాతన భారతదేశంలో ఆలయాల నిర్వహణపై ఇంత పెద్ద స్థాయిలో చర్చ జరగడం శుభపరిణామం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడం కోసం, ధార్మిక కార్యక్రమాలను అమలు చేయడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ మాట్లాడుతూ హిందూ సంస్కతి సాంప్రదాయాలను కాపాడడానికి స్వాతంత్య్రానికి మునుపే చత్రపతి శివాజీ మహారాజ్‌ వీరోచిత పోరాటాలను చేశారన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ మాట్లాడుతూ టెంపుల్‌ కన్వెన్షన్‌ ద్వారా ఆధ్యాత్మికతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విస్తత మార్గాలు ఏర్పడతాయన్నారు. సనాతన ధర్మంలో భాగంగా ఆలయాల పునర్జీవనం ఆవశ్యకతను ఆనాడే చత్రపతి శివాజీ మహారాజ్‌ పాటించారన్నారు. పాశ్చాత్య సాంప్రదాయాలను వీడి సనాతన సాంప్రదాయాలను యువత పాటించాలని, ఇందుకు ధార్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఓ మంచి మార్గం అన్నారు. ఆధ్యాత్మిక గురువు ఆచార్య స్వామి గోవింద దేవ్‌ గిర్జి మహారాజ్‌ మాట్లాడుతూ ఆలయాల నిర్వహణకు టెక్నాలజీ వినియోగం అందుబాటులో ఉన్న నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణ, భారత సంస్కతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడానికి చక్కటి వేదిక ఈ మహా కుంబ్‌ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ సి ఆర్‌ ముకుంద మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఓ ఆలయం ఉండాలని, ఆలయ నిర్వహణకు ఓ భవనం ఏర్పాటు చేసుకొని తద్వారా ఆ ప్రాంతంలో ధార్మిక కార్యక్రమాలను విస్తరింప చేయాలన్నారు. అంత్యోదయ ప్రతిస్టాన్‌ సంస్థ వ్యవస్థాపకులు గిరీష్‌ వాసుదేవ్‌ కులకర్ణి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్‌ భారత్‌ 2047 లో భాగంగా దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణకై ప్రత్యేక కార్యచరణతో పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్‌ టెంపుల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌ పో వ్యవస్థాపకులు గిరీష్‌ వాసుదేవ్‌ కులకర్ణి, చైర్మన్‌ ప్రసాద్‌ లాడ్‌, కేంద్రమంత్రి పట్నాయక్‌, మహారాష్ట్ర మంత్రులు సురేష్‌, విశ్వజిత్‌, గోవా మంత్రి రోహన్‌, ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, టిటిడి చైర్మన్‌ బిఆర్‌ నాయుడు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, థామస్‌, నెలవల విజయశ్రీ, బొజ్జల సుధీర్‌ రెడ్డి, కలికిరి మురళీమోహన్‌, గురజాల మోహన్‌, కురుగొండ్ల రామకష్ణ, కోనేటి ఆదిమూలం, మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు భానుప్రకాశ్‌ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ దేవాలయాల కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సాదర స్వాగతం లభించింది.

➡️